ప్రజాశక్తి - చందర్లపాడు (ఎన్‌టిఆర్) : చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమొలు సైదులు మాట్లాడుతూ.. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందన్నారు. పచ్చి రొట్ట విత్తనాలకు సంబంధించి గతంలో పట్టాదారు పాసుపుస్తకం తీసుకు వెళితే వ్యవసాయ అధికారులు పచ్చిరొట్ట విత్తనాలు ఇచ్చేవారని ప్రస్తుతం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కౌలు రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూ యజమాని వేలిముద్ర వేస్తేనే ఇస్తామనే నిబంధన వల్ల, భూయజమాని అందుబాటులో లేక కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. భూ యజమాని వేలిముద్రతో సంబంధం లేకుండా విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు మన్నేపల్లి శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు ,మన్నెం బసవయ్య, మాన్నెం మాధవరావు, శీలంనేని రమణయ్య, ములకలపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










