ఆప్ఘనిస్తాన్‌లో పరిణామాలు 20 ఏళ్లుగా దాన్ని ఆక్రమించిన అమెరికా గానీ, ఇతర దేశాలు గానీ ఊహించిన దానికంటే వేగంగా జరిగిపోతున్నాయి. గత వారం ఆఫ్ఘనిస్తాన్‌లో వేగంగా జరిగిన పరిణామాలు గమనిస్తే భారత పాలకులు అమెరికాకు అంటకాగి...తన విదేశాంగ విధానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడం వల్ల జరిగే నష్టమేమిటో అర్ధమవుతుంది. ఆగస్టు 15న మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటే అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘని నాలుగు కార్లు, హెలీకాప్టర్ నిండా డబ్బు తీసుకుని ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ విడిచి పలాయనం చిత్తగించారు. గత కొద్ది వారాలుగా మెరుపు వేగంతో వివిధ నగరాలు, ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వచ్చిన తాలిబన్లు కాబూల్ లోకి సునాయాసంగా ప్రవేశించారు. తాలిబన్ల నుండి తప్పుకోడానికి అమెరికా సైన్యం తుండూ తపాకీ పట్టుకుని విమానాల్లో పారిపోవడం 1975లో వియత్నాం నుండి అమెరికా దళాలు పారిపోయిన దృశ్యాలను తలపించింది. 20 ఏళ్లుగా అమెరికా 'శిక్షణ' ఇచ్చి, పెంచి పోషించిన ఆఫ్ఘన్ ప్రభుత్వ సైన్యం ఎక్కడికక్కడ తాలిబన్లతో బేరాలకు వచ్చి లంగిపోయింది. కొందరు విస్తారమైన మైదానాలు దాటుకుంటూ పారిపోయారు. మొత్తం మీద అమెరికా సేనల ఉపసంహరణ తరువాత అది 'నిర్మించిన ఆఫ్ఘనిస్తాన్' తాలిబాన్ల ముందు పేకమేడలా కూలిపోయింది.
గత ఏడాది ఫిబ్రవరి 29న కతార్ రాజధాని దోహాలో అమెరికాకూ, తాలిబన్లకూ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టింది. అమెరికా దళాలు భద్రంగా స్వదేశానికి వెళ్లిపోవడానికి తాలిబన్లు అడ్డుపడకూడదన్నది ఈ ఒప్పందంతో ప్రధాన అంశం. ఈ ఒప్పందం తరువాత ఏదో ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమవుతుందని అందరూ భావించారు. కానీ అది ఇంత వేగంగా, అమెరికాకు ఇంత తలవంపులుగా జరుగుతుందని పశ్చిమ దేశాల దౌత్య నిపుణులుగానీ, మీడియా గానీ ఊహించలేదు. అమెరికా 'సైనిక శిక్షణ' మీద నమ్మకం పెట్టుకున్న చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ దళాలు చాలా కాలం పాటు తాలిబన్లను నిలువరించగలుగుతాయని అనుకున్నారు. అమెరికా నిష్క్రమణ తరువాత ఆ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందనీ, సిరియా మాదిరిగానే ఆయా దేశాలు ఈ అంతర్యుద్ధంలో తమ తమ పాత్రలు నిర్వహిస్తాయనీ అనుకున్నారు. అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టినప్పటికీ ఏదో ఒక రూపంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పవచ్చుననుకుంది. భారత దేశం కూడా సరిగ్గా ఇదే అభిప్రాయంలో ఉండి ఆఫ్ఘనిస్తాన్‌లో రానున్న పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేకపోయిందని మన దౌత్య నిపుణులు ఇప్పుడు చెబుతున్నారు.
అమెరికా సైనిక శక్తి, దౌత్య నీతి పట్ల అపారమైన నమ్మకంతో వ్యవహరించిన భారత పాలకులు నేడు ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పట్ల బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అవ్వడం అంటే ఈ ప్రాంతంలో ఇప్పటికే అమెరికాను నమ్ముకుని ఇరుగు పొరుగు దేశాలకు దూరమైన భారత్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా దూరమవుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో అమెరికా విధానాలకు భారత దేశం పూర్తి మద్దతు ఇచ్చినప్పటికీ, అమెరికా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్‌కు ఏనాడూ ప్రయోజనకరంగా వ్యవహరించలేదు. దోహాలో జరుగుతున్న చర్చల ప్రక్రియకు భారత్‌ను దూరం పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచి వెళ్లిన తరువాత కూడా ఈ దేశంపై పట్టు నిలుపుకోడానికి అమెరికా ఏర్పాటు చేసిన మధ్య ఆసియా 'చతుష్ట కూటమి' (క్వాడ్)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లను చేర్చుకుంది గానీ భారత్‌కు స్థానం కల్పించలేదు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్‌లో జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో పాటు భారత్ భాగస్వామిగా ఉంది. అక్కడ చైనాను నిలువరించా లన్న తన సైనిక వ్యూహంలో పావుగా వాడుకు నేందుకు భారత్‌ను చేర్చుకుంది. కానీ భారత్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మాత్రం దానికి స్థానం కల్పించడానికి ముందుకు రాలేదు.
తాలిబన్లకు ముందు నుండి మద్దతిస్తున్న పాకిస్తాన్ రానున్న ఆఫ్ఘన్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుందని అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌తో మధ్య ఆసియా లోని అనేక దేశాలకు సరిహద్దులు ఉన్నాయి. తాలిబన్లు అధికారం లోకి వస్తే తమ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని భావించి ఈ ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. రష్యా తాలిబన్లతో అనేక దఫాలు చర్చలు జరిపింది. ఆఫ్ఘన్ భూభాగం మీద నుండి రష్యాపైగానీ, పొరుగు దేశాల పైన గానీ దాడులకు అనుమతివ్వబోమని తాలిబన్లు హమీ ఇచ్చారు. తాలిబన్ నాయకత్వంతో చైనా చర్చలు జరిపి కొంత అవగాహనకు వచ్చింది. కొద్ది వారాల క్రితం తాలిబన్ల ఉన్నతాధికార బృందం చైనా సందర్శించి చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యింది. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఇరాన్ కూడా తాలిబన్లతో చర్చలు జరిపి తమ దేశ ఆందోళనలను వివరించింది. ఈ చర్చల ఫలితంగానూ, ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ పాత విధానాలు కొన్ని విడిచిపెట్టినట్లు ప్రకటించారు. మహిళలు విద్యా, ఉద్యోగాలు చేయడానికి అనుమతిస్తామని ప్రకటించారు. ఉగ్రవాదలు తమ దేశం మీద నుండి ఇతర దేశాల మీద దాడి చేయడానికి అనుమతివ్వబోమని హామీ ఇచ్చారు. తాలిబన్ల గత చరిత్ర, మానవ హక్కులను కాలరాచే వారి క్రూరత్వాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ హామీలు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి.
అయితే అమెరికాను నమ్ముకుని దాని చెంగు పట్టుకు తిరిగిన భారత దేశం మాత్రం ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యంది. మన దేశం అమెరికా-తాలిబాన్ సంబంధాల మీద ఆధారపడ్డం వల్ల చివరికి అమెరికా మాదిరిగా మనం కూడా మన పౌరులను ఆగమేఘాల మీద ఆ దేశం నుండి తరలించాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా వేరుపడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అవుతున్న తరుణంలో కూడా మోడీ ప్రభుత్వం తాలిబన్ల 'చట్టబద్దత' గురించి మాట్లాడ్డం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో నేడు జరుగుతున్న పరిణామాల్లో మరింత వేరుపడిపోయింది.
ఇక రెండవ విషయం, అమెరికా భరోసా చూసుకుని క్వాడ్‌లో చేరిన భారత దేశం అమెరికా సరఫరా చేసే ఆయుధాలు, దాని 'సైనిక శిక్షణ'పై నమ్మకం పెంచుకున్నదని ఇటీవలి చాలా పరిణామాలు తెలుపుతున్నాయి. కానీ అమెరికా ఎల్లవేళలా తన ప్రయోజనాల కోసమే సైనిక కూటములు కడుతుందనీ, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకుని అవసరం తీరాక అవతల పారేస్తుందని నాడు ఇరాన్-ఇరాక్ యుద్ధం విషయం లోనూ ఇంకా అనేక సందర్భాల్లోనూ రుజువైంది. నేడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం యుద్ధానికి దిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను సుస్థిరమైన, ఆధునిక దేశంగా నిర్మిస్తానని అమెరికా ప్రపంచానికి హామీ ఇచ్చింది. రెండేళ్ల లోనే దేశం మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాం. ఇక దేశాన్ని సుస్థిరాభివృద్ధి పథంలో పెట్టడమే తరువాయి అని నాటి అమెరికా రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ పేర్కొన్నారు. కానీ జరిగింది దానికి భిన్నం. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా జరిపిన సుదీర్ఘ యుద్ధంలో అమెరికా 20 ఏళ్లలో 2 లక్షల కోట్ల డాలర్ల ఖర్చు చేసింది. యుద్ధంలో వేలాది మంది ఆఫ్ఘన్ పిల్లలు, స్త్రీ, పురుషులు చనిపోయారు. దేశం సర్వనాశనం అయింది. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఓడిపోయిన అమెరికా అక్కడి ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, ప్రజలను వదిలేసి అవమా నకరమైన రీతిలో దేశం నుండి తప్పుకున్నది. భారత దేశాన్ని కూడా రేపు అవసరం తీరాక అమెరికా ఇదే విధంగా వదిలిపెట్టేయదని ఏమీ లేదు. ఇంకా దుర్మార్గం ఏమంటే ఇరాన్‌పై పదేళ్ల యుద్ధంలో ఇరాక్‌ను అన్ని విధాల ఉపయోగించుకున్న అమెరికా తరువాత ఆ ఇరాక్ పైనే పాశవికంగా దాడి చేసి లక్షలాది మంది ప్రజలను పొట్టన బెట్టుకుంది. దేశాన్ని ధ్వంసం చేసింది.
అమెరికాతో అంటకాగడం వల్ల భారత దేశంలో కొద్ది మంది కుబేరులకు లాభం చేకూరవచ్చుగాక కానీ దేశం యొక్క విస్తారమైన ప్రయోజనాలకు తీవ్ర నష్టం సంభవిస్తుందన్న వాస్తవాన్ని నేడు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు మరో మారు రుజువు చేస్తున్నాయి. అమెరికాతో అణుఒప్పందంలో భాగంగా మన దేశం ఇరాన్‌తో సత్సంబంధాలను వదులుకుంది. దాని వల్ల చమురు రంగంలో మన దేశం అపారమైన నష్టాన్ని అనుభవిస్తోంది. అదే విధంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్ కూటమి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చిన భారత పాలకులు ఇరుగు పొరుగు దేశాలను విస్మరించారు. సార్క్ దేశాల్లో పెద్దదైన భారత దేశం తన పొరుగున ఉన్న ఈ కూటమిని విస్మరించింది. 2014 తరువాత సార్క్ శిఖరాగ్ర సభ జరగలేదు. 2016 సార్క్ శిఖరాగ్ర సభలో పాల్గనడానికి భారత దేశం అంగీకరించకపోవడంతో ఈ క్రమం దాదాపు అంతమై పోయింది. సార్క్‌ను పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం సుముఖంగా లేదనీ, దానికి బదులుగా ఇటీవల ఏర్పాటు చేయబడిన బంగాళాఖాత ప్రాంత దేశాల సాంకేతిక ఆర్థిక సహకార గ్రూపు (బిమ్‌స్టెక్) పట్ల ఆసక్తి కలిగి ఉందన్న అభిప్రాయం ఈ దేశాల్లో పెరిగింది. బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలతో ఈ గ్రూపు ఏర్పడింది.
భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 'వ్యాక్సిన్ దౌత్యం' బెడిసి కొట్టడంతో మన పొరుగున ఉన్న అనేక దేశాలు మనకు దూరమైనాయి. ఈ దేశాలకు చైనా సహాయం చేసింది. భారత్ మినహా ఇతర దక్షిణాసియా దేశాలన్నిటికీ అది వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ చర్యల వల్ల భారత దేశం ఇరుగు పొరుగు దేశాల నుండి ఎంతోకొంత ఒంటరిపాటు అయింది. అందువల్లనే సార్క్ లోని ఎనిమిది దేశాల్లో అయిదు దేశాలు చైనా చొరవతో ప్రారంభమైన చైనాాదక్షిణాసియా దేశాల పేదరికం నిర్మూలన, సహకార అభివృద్ధి కేంద్రంలో చేరాయి. 2021 ఏప్రిల్‌లో చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం జులై నెలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పటికైనా భారత్ పాలకులు అమెరికాపై ఆధారపడ్డం మానుకుని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తారా? లేక అంతర్జాతీయ యవనిక మీద మన దేశ ఒంటరిపాటును మరింత పెంచుతారా?

ఎస్. వెంకట్రావు










