- పదేళ్ల పరిమితితో అత్యధికంగా 8 శాతం వడ్డీ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పేరులో పవర్ ఉన్నప్పటికీ.. పాలనలో మాత్రం ఆ సంస్థ అప్పులపాలుగానే కనిపిస్తోంది. ఇంధన శాఖ పరిధిలో ఉన్న ఎపి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బయట నుంచి రుణాలు తీసుకుని, ఇతర శాఖల నుంచి డిపాజిట్లు సేకరించి నిధులు సమకూర్చుకుంటుంది. ఈ నిధులను వడ్డీపై విద్యుత్ అవసరాల కోసం జెన్‌కో, డిస్కామ్ వంటి సంస్థలకు తిరిగి రుణాలుగా ఇస్తుంది. దాదాపు ఆర్థికశాఖకు సంబంధించి రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఎస్‌డిసి), ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్‌ల మాదిరి పవర్ ఫైనాన్స్ కూడా పనిచేస్తుంది. అయితే తీసుకున్న రుణాలు ఎంత వరకు తీర్చడం సాధ్యమవుతుందన్న భావన ఇంధన శాఖ అధికారుల్లోనే వ్యక్తమవుతోంది.
తాజాగా పవర్ ఫైనాన్స్ సంస్థ తీసుకున్న రుణాలు మొత్తం రూ.11,143.73 కోట్లుగా ఉంది. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రూ.9,235 కోట్లు కాగా, పలు శాఖల నుంచి తీసుకున్న రుణం రూ.1,909 కోట్లుగా ఉంది. బ్యాంకులకు సంబంధించి అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2,998 కోట్లను 7.25 శాతం వడ్డీతో 12 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారు. అలాగే కెనరా బ్యాంకు నుంచి 7.60 శాతం వడ్డీతో 1,987 కోట్లు, స్టేట్ బ్యాంకు నుంచి 7.55 శాతం వడ్డీతో రూ.1,497 కోట్లు తీసుకున్నారు. ఇతర బ్యాంకుల నుంచి కూడా మరికొంత సమీకరించారు.
శాఖల నుంచి తీసుకున్న రుణాలు బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం గమనార్హం. ఎస్‌పిడిసిఎల్ పింఛను, గ్రాట్యుటీ ఖాతా నుంచి తీసుకున్న డిపాజిట్లకు ఏకంగా 8 శాతం వడ్డీగా చెల్లించాలని నిర్ణయించారు. పట్టణ మౌలిక ఆస్తు నిర్వహణ విభాగానికి ఆరు శాతం చొప్పున, సోలార్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న డిపాజిట్లకు 5.75 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నారు. చాలా సంస్థలు డిపాజిట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో పెట్టి, తరువాత అవసరాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కనిపిస్తోంది. దీరతో ఆ సంస్థలపై ఆర్థికభారం పడుతోందని సమాచారం. ఈ సమస్యల నుంచి అవి ఎలా గట్టెక్కుతాయో, తీసుకున్న రుణాలను, డిపాజిట్లను పవర్ ఫైనాన్స్ సంస్థ ఎలా తీరుస్తుందోనన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది.










