చెన్నూరు: చెన్నూరులో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన ఏడాదికే దంపతులు సాయికుమార్‌రెడ్డి(30), హేమమాలిని (28) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి అవసరం నిమిత్తం తన భూమిని తనకా పెట్టి ఒక వ్యక్తికి వద్ద రూ.3 లక్షల అప్పుచేసి, తిరిగి ఆ అప్పును ఇచ్చి తన భూమిని తనకు ఇవ్వాల్సిందిగా కోరితే ఇవ్వకపోగా పోలీస్ స్టేషన్లకు తిప్పి వేధించారు. తమకు న్యాయం జరగదని భావించి 8 నెలల గర్భిణీ అయిన తన భార్యతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నూరులో చోటు చేసుకుంది. మృతుని తల్లి వరలక్ష్మి వివరాల మేరకు... సాయి కుమార్‌రెడ్డి కడప నగరం పాలెంపల్లికి చెందిన నారాయణ స్వామికి రూ.మూడు లక్షలకు ఆయకానికి పెట్టారు. ఆయకానికి పెట్టే ముందు తన డబ్బు వడ్డీతో సహా ఎప్పుడైనా చెల్లించండి, మీ భూమి మీకు తిరిగి ఇస్తానని నారాయణస్వామి చెప్పారు. ఇటీవల డబ్బు తీసుకొని తన భూమి తనకు ఇవ్వాలని సాయి కుమార్‌రెడ్డి నారాయణస్వామిని అడుగగా అతను ఇవ్వకపోగా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. నారాయణస్వామి పోలీసులతో బెదిరించాడు. మానసికంగా వేధించడంతో మనస్థాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రైల్వే ఎస్‌ఐ రారాజు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి కనుమలోపల్లె నుండి కడప మార్చురీ, చెన్నూరు వరకు యువ దంపతుల మహదేహాల అంత్యక్రియల ముగిసేంత వరకు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ఆ కుటుంబానికి అండదండగా నిలబడ్డారు.
సాయిది ప్రేమ వివాహం : సాయి కుమార్‌రెడ్డి, హేమమాలినితో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కడప నగరంలోని దుర్గమ్మ కాలనీలో సంసారం ఉంటున్నారు. సాయి కుమార్‌రెడ్డి ఈకామ్ వాటర్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. హేమమాలిని రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
గ్రామంలో విషాదఛాయలు : యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త మండల వ్యాప్తంగా వ్యాపించడంతో అటు రామనపల్లి, ఇటు చెన్నూరు భవాని నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. వారిని కడసారిగా చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు.










