Dec 02,2022 21:31

ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ రామాంజినేయులు

         తాడిమర్రి : అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మినారాయణ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... వడ్డెర కుంచపు రామాంజినేయులు(64)కు 15 ఎకరాల పొలం ఉంది. ఇందులో బోరుబావులు, వర్షాధార పంటలుగా వేరుశనగ, కందితో పాటు చీనితోటలను సాగు చేశాడు. పంటలు సాగు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 15 లక్షల వరకు అప్పులు చేశాడు. గడిచిన ఐదేళ్లుగా ఒక్కసారి కూడా పంట చేతికందలేదు. దీంతో అప్పులు తీర్చడం కష్టం అయ్యింది. కుటుంబ పోషణ నిమిత్తం ఇటీవల ఇంటి వద్ద వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంతమాత్రంగానే వచ్చింది. వ్యవసాయం, వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని నిత్యం మానసిక వేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తరువాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తించిన కుటుంబ సభ్యులు కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.