Apr 05,2023 21:39

పరామర్శిస్తున్న ఐద్వా నాయకులు

పరామర్శిస్తున్న ఐద్వా నాయకులు
అప్పు చెల్లించాలని మహిళపై దాడి అమానుషం
-అవమానంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం
-నిందితులను అరెస్టు చేయాలని ఐద్వా సంఘం డిమాండ్‌
నెల్లూరు: కుటుంబ అవసరాల నిమిత్తం అప్పుగా తీసుకున్న నగదు తిరిగి చెల్లించలేందంటూ మహిళపై దాడికి పాల్పడటంతో, తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో నిందితులైన వారిని పోలీసులు తక్షణమే అరెస్టు చేసి బాధితరాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా సంఘం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. పొదలకూరు మండలంలోని చాటకోట్ల గ్రామంలో ఈ నెల ఒకటవ తేదీన తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళపై దాడికి పాల్పడటం, ఈ దాడితో తీవ్రంగా మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితికి చేరుకొన్న బాధితురాలు జిజిహెచ్‌లో వైద్యచికిత్సలు తీసుకుంటుంది. బుధవారం భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ నాయకులు ఆ బాధితురాలని పరామర్శించారు.
అనంతరం మీడియాతో ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి షేక్‌ మస్తాన్‌బీ మాట్లాడుతూ పొదలకూరు మండలం చాటగుట్ల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడైన శ్రీను కుటుంబ అవసరాలమేరకు తాను పనిచేస్తున్న ప్రభాకర్‌ అనే వ్యక్తి వద్ద రూ.10 వేలు రుణంగా తీసుకున్నారన్నారు. అయితే తీసుకున్న అప్పు చెల్లించాలని, ఈ వ్యవహారంపై మాట్లాడాలంటూ చాటగొట్ల గ్రామంలోని శివారు ప్రాంతంలోని వాటర్‌ ప్లాంట్‌ వద్దకు శ్రీనివాసులు భార్య అయిన లక్ష్మీని ప్రభాకర్‌ రమ్మని పిలిపించారన్నారు. ఈ క్రమంలో లక్ష్మి తమ అక్కను తల్లిని తోడుగా తీసుకొని వెళ్ళిందన్నారు. అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలంటూ పత్రికల్లో రాయలేని విధంగా ప్రభాకర్‌ భార్య ప్రమీలమ్మ లక్ష్మీని బూతులు తిడుతుండటంతో విని తట్టుకోలేని లక్ష్మి అక్క జోక్యం చేసుకొని బూతుల్లో తిట్టడం సరైనది కాదని అప్పు ఇవ్వవలసి ఉంటే చెల్లిస్తారని సమాదానం ఇచ్చిందన్నారు. ఊహించని విధంగా సమాదానం రావడంతో ప్రభాకర్‌ భార్య ప్రమీలమ్మ చెప్పు తీసుకొని లక్ష్మీ అక్క మీద దాడికి పాల్పడిందని, కింద పడిపోయిన లక్ష్మీ అక్క మీద దాడి చేసిందన్నారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబం స్టేషన్‌కు వచ్చినా పోలీసులు స్పందించలేదన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఆ గ్రామ సర్పంచ్‌, వైసిపి నాయకులైన సర్పంచ్‌ భర్త శ్రీ కళ పెంచలయ్య కలిసి తమకు న్యాయం చేయాలని కోరినా స్పందించలేదన్నారు. బాధితురాలికి ఎవరూ న్యాయం చేయకపోవడంతో అవమానభారంతో పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాధితురాలు పురుగుల మందు సేవించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పొదలకూరులోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్సలు నిర్వహించారన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసు నమోదు చేశారే తప్ప నిందితులను అదుపులోకి తీసుకొలేదన్నారు. బాధితురాలకి మెరుగైన చికిత్సలు అవసరమని ఆరోగ్యకేంద్రం వైద్యసిబ్బంది నగరంలోని జిజిహెచ్‌కి తరలించారన్నారు. అప్పు తీర్చ నందుకు మహిళలను దుర్భాషలాడడం వారి మీద దాడి చేయడం హేయమైన చర్య అని , బాధితురాలిపై దాడికి పాల్పడ్డవారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేయనిపక్షంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌పిని, కలెక్టర్‌ను కలిసి బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె. పద్మ , షేక్‌ శంషాద్‌ పాల్గొన్నారు