Aug 30,2023 22:53

ఖాతా పుస్తకాలు అందజేస్తున్న షోరూం నిర్వాహకులు

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : సుధీర్ఘ కాలంగా చేనేత వస్త్రాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆప్కో షోరూమ్‌లలో నెలవారీ పొదుపు పథకాన్ని ప్రారంభించడంతో పాటు 30 శాతం రాయితీపై వస్త్రాలను విక్రయిస్తున్నట్లు ఆప్కో మండల వాణిజ్య అధికారి యస్‌.రఘునంద తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డు రామమందిరం వెనుక ఆధునీకరించిన ఆప్కో షోరూంలో బుధవారం డియంఒ రఘునంద నెల వారి పొదుపు పథకాన్ని ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాభిమానుల సౌకర్యార్ధం ఆప్కో షోరూమ్‌లలో నెలవారీ పొదుపు పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పొదుపు పథకం ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున 11 నెలలు క్రమం తప్పకుండా వినియోగదారుడు చెల్లిస్తే 12వ నెల వాయిదా రూ.వెయ్యి చెల్లిస్తుందన్నారు. 12 నెలల వాయిదా పూర్తయిన వెంటనే వినియోగదారుడు రూ.17 వేల 100 రూపాయలు విలువ గల ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. నెలవారీ పొదుపు పథకం ద్వారా రూ.5 వేల 100 రూపాయలు వినియోగదారుడికి లబ్ధి చేకూరినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్రెడిట్‌, సేల్స్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మంగళగిరి, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, మాధవరం, చీరాలలకు చెందిన చీరలు, దుప్పట్లు, టవల్స్‌, లుంగీలు 30 శాతం రాయితీపై అమ్మకాలకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నగరంలోని ఏలూరు రోడ్డు, రామమందిరం వెనుక రోడ్డులో గల ఆప్కో మెగా షోరూమ్‌ను ఆధునీకరించినట్లు తెలిపారు. అనంతరం ఖాతాదారులకు పొదుపు బుక్స్‌ ను అందజేశారు. కార్యక్రమంలో లో ఆప్కో మెగా షో రూం మేనేజర్‌ వై. గోపాల కష్ణ సిబ్బంది పి.రేవతి ఏ.రత్నం ఎస్‌.తేజశ్రీ వినియోగదారులు పాల్గొన్నారు.