నంద్యాల (కర్నూలు) : శస్త్ర చికిత్స సమయంలో పొరపాటున మహిళ కడుపులో గుడ్డముక్కను పెట్టి కుట్లేసి పంపేశారు. దీంతో ఆ కుట్ల వద్ద చీము పట్టి సదరు మహిళ 2 నెలలు బాధతో తల్లడిల్లిపోయింది. నంద్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకెళితే.... నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నందిని అనే మహిళ కు రెండు నెలల క్రితం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్స (సిజేరియన్) చేసే సమయంలో ఎప్పటికప్పుడు రక్తాన్ని శుభ్రం చేసే గుడ్డ ముక్కను పొరబాటున లోపలే పెట్టి కుట్లు వేశారు. ఆసుపత్రి నుండి పంపేశారు. ఆ బాలింతకు రెండు నెలలుగా కుట్ల వద్ద చీము కారుతోంది. నరకయాతన పడ్డ ఆమె మూడు సార్లు ఆసుపత్రికి వచ్చినప్పటికీ వైద్యులు మామూలు ఇన్ఫెక్షన్ అని మందులిచ్చి పంపించారు. అయినప్పటికీ తగ్గలేదు. దీంతో ఆమె ఆసుపత్రిలోని జనరల్ సర్జన్ వద్దకు వెళ్లింది. ఆయన వెంటనే స్కానింగ్ రాసి ఇచ్చారు. చివరికి స్కానింగ్‌లో అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో గుడ్డ ముక్క ఉన్నట్లు గుర్తించారు. కడుపులో గుడ్డ ముక్క ఉందనే విషయాన్ని సదరు వైద్యుడు ఆమెకు చెప్పకుండా గైనిక్ వైద్యులకు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. కుట్ల వద్ద కోత పెట్టి రెండించుల మేర ఉన్న గుడ్డ ముక్కను తొలగించారు. ఏమీ కాదని, వారంలో తగ్గిపోతుందని మహిళకు చెప్పి పంపేశారు.










