- ఇవే చివరి సమావేశాలు?
- 21 బిల్లులు పెట్టే అవకాశం
- నేడు బిఎసిలో నిర్ణయం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ 11వ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సంతాప తీర్మానం అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్ని రోజులు శాసనసభ జరపాలనేది నిర్ణయం తీసుకోనున్నారు. 15వ శాసనసభకు ఇవే చివరి సమావేశాలు కానున్నట్లు తెలిసింది. సంఖ్యాపరంగానూ 11వ సెషన్ కావడంతో ఇంతటితోనే దీన్ని ముగించేయాలని, తరువాత కొత్త ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలిసింది. అయితే ఎన్నికలు జరిగేలోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశమూ లేకపోలేదని, 12వ సంఖ్య జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులు పెట్టనున్నారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అంశాలపైనా ప్రత్యేక అంశంగా చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిపక్ష టిడిపి కూడా ఈ సమావేశాలకు హాజరై చంద్రబాబు అరెస్టు క్రమంలో చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడిన అంశాలను సభావేదికగా బయటపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ కక్షసాధింపు అంశాలనూ ఈ సమావేశాల్లోనే చర్చించనున్నారు.
- పటిష్ట బందోబస్తు
శాసనమండలి, శాసనసభ సమావేశాలు గురువారం నుంచి జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తుతోపాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. శాసనసభ కమిటీ హాలులో బుధవారం మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, స్పీకరు తమ్మినేని సీతారాం అధ్యక్షతన పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలపై సమీక్షిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్, మార్షల్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాస్ లేకుండా ఏ ఒక్కరినీ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించ వద్దని డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. ఇతరులకు ఎటువంటి విజిటింగ్ పాస్‌లు జారీ చేయొద్దని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను ఆదేశించారు. సభ్యుల రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీరో అవర్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అధికారులు వెంటనే తెలపాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










