కడపప్రతినిధి : అన్నమయ్య రిజర్వాయర్ పునర్నిర్మాణానికి కసరత్తు ఊపందుకుంది. 2021 నవంబర్‌లో జవాద్ తుఫాన్ ధాటికి అన్నమయ్య మట్టికట్ట పూర్తిగా తెగడంతో నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పునద్ధరణకు సంబంధించి ఇరిగేషన్ ఇంజినీరింగ్ నిపు ణులతో విజయవాడకు చెందిన హైడ్రాలజీ, డిజైనింగ్, గేట్ల పెంపు, నీటి విడు దల సామర్య్త పెంపు వంటి ఇతర విభాగాలకు సంబంధించిన ఇంజినీరింగ్ నిపు ణులు, జిల్లా ఇంజినీరింగ్ నిపుణులు, ఉన్నతాధికారులు పలుమార్లు పరిశీ లించిన సంగతి తెలిసిందే. అనేక వడపోతల ఓ ప్రయివేటు ఏజెన్సీ సహాయంతో ప్రతిపాదనలు తయారు చేయించారు. వందేళ్లలో ఏటా బహుదా నదికి వచ్చే వరద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని కాంక్రీట్ డ్యామ్‌ను నిర్ణయించారు. గత ఏడాది డిసెంబర్ మూడవ తేదీన జిఒను జారీ చేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఇంజినీరింగ్ యంత్రాంగం అదే నెల మూడవ వారంలో టెండర్లు పిలిచింది. రాఘవ, పిఎల్‌ఆర్ వంటి కాంట్రాక్టు సంస్థలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో టెండర్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం సిఒటి విభాగానికి పంపించనున్నారు. సిఒటి ఆమోదం లభించిన అనంతరం ఎంపికైన సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుని పనుల్ని గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జిఒలో పేర్కొన్న మేరకు రెండేళ్ల వ్యవధిలో కాంక్రీట్‌తో కూడిన రిజర్వాయర్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.










