Apr 17,2022 07:40
  • తిరుమల కొండపై జ్ఞాపకాలను చెరిపేసిన టిటిడి
  • హామీలను తుంగలో తొక్కిన వైనం
  • పోరుబాటలో 'తాళ్లపాకం' భక్తులు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తెలుగు వాగ్గేయకారుడు... పదకవితా పితామహుడు... తిరుమల శ్రీవారికి అత్యంత ప్రియమైన భక్తుడు తాళ్లపాక అన్నమయ్యకు తిరుమల కొండపై అన్యాయం జరిగింది. అన్నమయ్య జ్ఞాపకాలను, వారసత్వ సంపదను టిటిడి తుంగలో తొక్కింది. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తొలగించిన అన్నమయ్య గృహాన్ని, మండపాన్ని తిరిగి పునర్నిర్మించి అన్నమయ్యకు పూజలు జరిగేలా చూడాలని గత 15 సంవత్సరాలుగా అన్నమయ్య వంశస్థులు పాలకమండలి, యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో 'పోరుబాట'కు సిద్ధమయ్యారు.
     తిరుమల కొండపై వరాహస్వామి ఆలయం వెనుక భాగంలో శతాబ్దాలుగా ఓ జ్ఞాపకంగా పరిరక్షించబడుతున్న అన్నమయ్య నివాస గృహాన్ని, మండపాన్ని టిటిడి అధికారులు మాస్టర్‌ప్లాన్‌ అమల్లో భాగంగా 2004, 2007లో తొలగించారు. అన్నమయ్య జ్ఞాపకంగా ఉన్న ఇంటిని, మండపాన్ని కూల్చవద్దని తాళ్లపాక వంశస్థులు అప్పట్లో వేడుకోగా 'మరింత సుందరంగా పునర్నిర్మాణం చేపట్టి ప్రాధాన్యత ఇస్తాం' అని టిటిడి అధికారులు రాతపూర్వక హామీ ఇచ్చి వారిని నమ్మించారు. అన్నమయ్య జ్ఞాపకాలను పునరుద్దరించాలని 15 ఏళ్లుగా అన్నమయ్య వంశీకులు వేడుకొంటున్నా టిటిడి పట్టించుకోకపోవడం విచారకరం. ఓ వైపు భక్తుల విరాళాలను భారీగా వెచ్చించి టిటిడి పాలకమండలి దేశమంతటా కల్యాణ మండపాలు, శ్రీవారి ఆలయాలను నిర్మిస్తూ, మరోవైపు అన్నమయ్య జ్ఞాపకాలను తుడిచేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. కడప జిల్లా రాజంపేట తాళ్లపాక గ్రామంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని నిర్మించిన టిటిడి, తిరుమల కొండపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయడం సమంజసమా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. 32వేల సంకీర్తనలు రాసిన పదకవితా పితామహుని నివాసం పట్ల చూపించే గౌరవం ఇదేనా అంటూ విశిష్ట స్వాములు, జానపద వృత్తి కళాకారులు, అన్నమయ్య వంశీకులు ప్రశ్నిస్తున్నారు.

                                            ఆక్రమణకు గురవుతున్న స్మారక నిర్మాణాలు

తిరుమల కొండపై తాళ్లపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబకు చెందిన నిర్మాణాలు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని సంరక్షించి స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలని 1994లోనే టిటిడి నిర్ణయించిందని అన్నమయ్య కళాక్షేత్రం నిర్వాహకులు విజయ శంకరస్వామి తెలిపారు. 'అవి పవిత్ర విగ్రహాలు కావని, అన్నమయ్య అక్కడే నివాసం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా'? అని టిటిడి అడిషనల్‌ ఇఒ ధర్మారెడ్డి మాట్లాడటం సముచితం కాదన్నారు. అన్నమయ్యకు జరిగిన అన్యాయంపై తెలుగు రాష్ట్రాల్లో సమాలోచన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 25 నుంచి తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల్లో మౌనదీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.