Apr 10,2023 22:22

ఫొటో : సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

అన్ని రంగాల్లోనూ ఎపి ప్రథమస్థానం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం విద్య, ఉపాధి కల్పన, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్‌ పరిధిలోని ఇరిగేన్‌ సచివాలయం పరిధిలోని 21 వార్డు ఎస్‌టి మోడల్‌ కాలనీ, ఉలవదిబ్బ ప్రాంతాల్లో ఆయన సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయం పరిధిలో గుర్తించిన సమస్యలను ఏ మేరకు పరిష్కరించారో ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు.
అనంతరం మోడల్‌ ఎస్‌టి కాలనీలో ఎంఎల్‌ఎ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఎల్‌ఎకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే అధికారులతో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. వార్డు పరిధిలో పలువురు లబ్ధిదారులు స్వంతంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటామని, ప్రభుత్వ అనుమతి మంజూరు చేయించాలని కోరడంతో వెంటనే గృహనిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో 93 సచివాలయాల్లో ఇప్పటి వరకు 42 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో 1.74 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలే గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, నాయకులు, ప్రజాప్రజానిధులు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తాము వెళ్తున్నామని, వాళ్లు కూడా తమతోపాటు వచ్చే ఏం అభివృద్ధి జరగలేదో వివరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ, వైస్‌ చైర్మన్లు డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, షేక్‌ సర్దార్‌, వైసిపి పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌ రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి డాక్టర్‌ సీహెచ్‌ ఆదిశేషయ్య, వైఎస్‌ఆర్‌ నాయకులు ఇందూరు వెంకటరమణారెడ్డి, నోటి వినరు కుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు కోడూరు కౌసల్యమ్మ, మహబూబ్‌ బాషా, చెరుకూరి కామాక్షయ్య నాయుడు, ఏఈ ప్రససాద్‌, తదితరులు పాల్గొన్నారు.