Nov 06,2023 23:02

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలని సిపిఎం కోరుతుందని పలువురు వక్తలు అన్నారు. ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర సోమవారం కాకినాడ జిల్లాలో రెండో రోజు కొనసాగింది. సామర్లకోటకు చేరుకున్న యాత్ర బృందానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. యాత్రను ముందుకు నడిపిస్తూ సిపిఎం నాయకులు పట్టణ పుర వీధుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఠాపురం రోడ్డు మార్గంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలను బృందం పరిశీలించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి అక్కడ అందుతున్న వైద్య సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూర్య కుమారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, మంతెన సీతారామ్‌ మాట్లాడుతూ చుట్టుపక్కల వేలాదిమంది పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు అధికమయ్యాయన్నారు. 50 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకలకు పెంచాలని కోరారు.
అనంతరం పెద్దాపురం మెయిన్‌ రోడ్డులో కరణం ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి మాట్లాడుతూ అసమానతలు లేని అభివద్ధి కోసం తాము చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపి, ఆ పార్టీకి వంత పాడుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీల్లా కాక ప్రజా ఉద్యమాలు చేపడుతున్న సిపిఎం కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తోందన్నారు. రూ.400కే గ్యాస్‌ సిలెండర్‌, యూనిట్‌ విద్యుత్‌ను రూ.1 కే ఇవ్వాలని, పెట్రోల్‌, డీజిల్‌ రూ.60కే ఇవ్వాలని, పేదలకు భూములను పంచి అందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని, 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సిపిఎం కోరుతోందన్నారు.
పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో సుదీర్ఘకాలంగా ప్రజలు తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదన్నారు. సామర్లకోటలో షుగర్‌ పరిశ్రమల మూత పట్టడంతో వందలాది మంది చుట్టుపక్కల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనేకమంది కార్మికులు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా 18 వరకు సాగో పరిశ్రమలు మూతబడడంతో రైతులు, కార్మికులు ఉపాధికి దూరమయ్యారన్నారు. స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనాలు ఇచ్చి పర్మినెంట్‌ చేయాలని, రూ.10 వేలు రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం సక్రమంగా మందులను కూడా ఇవ్వలేకపోతుందన్నారు. ఈ కార్యక్రమం వల్ల రోగులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇఎస్‌ఐ ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు హరిబాబు మాట్లాడుతూ అంబానీ, ఆదానీలకు సంపదను కట్టబెడుతున్న మోడీ విధానాలను అర్థం చేసుకొని ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులు, కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీలు, ఆశాలు, పారిశుధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు యాత్ర నాయకత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ యాత్రలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, కె.నాగు, డి.క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
వైసిపి, టిడిపి, జనసేనతో రాష్ట్రానికి ద్రోహం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, మంతెన సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా రక్షణ భేరి రాష్ట్ర బస్సు యాత్ర సందర్భంగా సోమవారం కాకినాడ సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విభజన హామీలు అమలు, రైతులకు గిట్టుబాటు ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. బిజెపి విధానాలను రాష్ట్రంలో వేగంగా అమలు చేస్తున్నారనాన్రు. కేంద్రంలోని మతోన్మాద ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ సామాజిక సాధికారిక యాత్ర చేయడం తగదన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారన్నారు. పట్టణాల్లో ఎటువంటి అభివద్ధి లేకపోగా ఆస్తి విలువ ఆధారిత పన్నులు, చెత్త పన్నులు విపరీతంగా పెంచేసి ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరుగుతుంటే, వారి భూములను లాక్కుంటుంటే వైసిపి సామాజిక సాధికారత అని యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాలలో చట్టాలను రద్దు చేస్తూ అమలు చేయడం లేదన్నారు. అనంతరం లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు చేపట్టిన యాత్ర వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి, రాష్ట్ర నాయకులు హరిబాబు, సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, జిల్లా నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జి పాల్గొన్నారు.