తెలుగులో టాలెంట్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో సుహాసిని ఒకరు. ఒకప్పుడు తెలుగులో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించిన ఆమె ఇప్పటికీ కొన్ని కీలకపాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక చిత్రాల్లో వస్తున్న ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు తాజా అంశాలను పంచుకుంటుంటారు. ఇక తాజాగా ఆమె నటించిన 'ఫోకస్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించిన మరిన్ని విశేషాలు..
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసనా హీరోయిన్‌గా నటించి, ప్రేక్షకులను బాగానే అలరించిన తమిళ హీరోయిన్ సుహాసిని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే సాంప్రదాయమైన చీరకట్టులో నటించి, పలు సెంటిమెంటల్ ఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో నటనా రంగాన్ని ప్రధానం చేసేటువంటి పలు అవార్డులనూ అందుకున్నారు. అయితే నటి సుహాసిని మొదటగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండిస్టీకి వచ్చినప్పటికీ.. సొంతంగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే నటి సుహాసిని కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నాన్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటనకు బ్రేక్ ఇవ్వలేదు. పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కాగా, ఈ మధ్యకాలంలో సుహాసిని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, ఇతర విషయాల ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
ఇటీవలే నటి సుహాసిని తెలుగులో సుమంత్ అక్కినేని హీరోగా నటించిన 'మళ్ళీ మొదలైంది' చిత్రంలో ప్రాధాన్యత గల పాత్రలో నటించారు. ప్రస్తుతం నటి సుహాసిని తెలుగులో సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఇక మొదటిసారి ఓ ఛాలెంజింగ్ రోల్‌లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన 'ఫోకస్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జి. సూర్య తేజ దర్శకత్వంలో వస్తున్న ఫోకస్ మూవీని 'స్కైరా' క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో సుహాసిని అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
నటన, దర్శకత్వం, నిర్మాణ రంగాల్లో..
సుహాసిని నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. తొలిసారి 1980లో 'నెంజతై కిల్లతే' అనే తమిళచిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు మణిరత్నాన్ని పెళ్లి చేసుకున్నారు. దర్శకత్వంలో 1996లో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన 'ఇందిర' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సుహాసినీనే సమకూర్చారు. భార్యాభర్తలు తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. సుహాసినీ తమిళ, తెలుగు, కన్నడతో పాటు మళయాళ భాషా చిత్రాల్లోనూ నటించారు. ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవానికి 1999లో ఎన్నికైన 'వానప్రస్థమ్' సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నారు. ఇక తెలుగులో నటించిన 'సిరివెన్నెల, సంసారం ఒక చదరంగం' సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.
ఫలానా భాషే కావాలంటే తిండి దొరకదు..
ఇటీవల సౌత్, బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తుండగా.. అజరు దేవగన్, కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ వార్ దీనిని మరింత పెంచేసింది. ఈ క్రమంలో సీనియర్ నటి సుహాసిని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో పలువురు మద్దతు పలుకుతున్నారు. కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సుహాసినీ 'హిందీ భాష చాలా మంచిది, హిందీ వాళ్లు మంచివాళ్లు.. వాళ్లతో మాట్లాడాలంటే మనమూ హిందీ నేర్చుకుంటే మంచిది. ఇక తమిళ్ వాళ్లు కూడా మంచివాళ్లే, కాబట్టి హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే మంచిది. తమ ఇంట్లో పనిచేసే వాళ్లలో కొందరు హిందీతో పాటు తెలుగులోనూ మాట్లాడతారు. తమిళంలోనూ మాట్లాడతారు. ఫలానా భాషే కావాలంటే తిండి దొరకదు. నటులు అన్న తర్వాత అన్ని భాషలూ నేర్చుకోవాలి' అని ఆమె అభిప్రాయపడ్డారు.
వరద బాధితులకు అండగా..
ఆ మధ్య చెన్నరులో వర్ష బీభత్సంతో నానా తిప్పలు పడుతున్న ప్రజలకు సుహాసిని అండగా నిలిచారు. ఆకలితో అలమటించిపోతున్న ప్రజలకు ఆపద్బాంధవిగా ఉన్నారు. దాదాపు 40 వేల మందికి సరిపోయే భోజన సదుపాయాలను దగ్గరుండి మరీ ఏర్పాటు చేశారు.
పేరు : సుహాసినీ మణిరత్నం
ఇతర పేర్లు : సుహాసినీ చారుహాసన్
పుట్టిన తేదీ : ఆగస్టు 15, 1961
పుట్టింది : పరమకుడి, తమిళనాడు
నివాసం : చెన్నరు
చదువు : గ్రాడ్యుయేట్ ఇన్ సినిమాటోగ్రఫీ
భర్త : మణిరత్నం
పిల్లలు : నందన్
తల్లిదండ్రులు : చారుహాసన్, కోమలమ్
తోబుట్టువులు : నందిని చారుహాసన్, సుభాషిణీ చారుహాసన్