తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు పాన్‌ఇండియా స్థాయిలో నిర్మాణమవుతున్నాయి. క్రమంగా మన సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఎక్కువ మంది బాలీవుడ్ హీరోయిన్లు.. తెలుగులో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. తద్వారా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఆఫర్స్ రావడం ఖాయమని నమ్ముతున్నారు. అంతేకాదు స్వయంగా తమంతట తామే డబ్బింగ్ కూడా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయారు.. 'మేజర్' హీరోయిన్ సయీ మంజ్రేకర్. 'మేజర్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న క్రమంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
బాలీవుడ్ టాప్ డైరెక్టర్, యాక్టర్, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. దబాంగ్-3 చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'గని' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా చేస్తుండగానే అడివి శేష్ 'మేజర్'లో ఛాన్స్ కొట్టేశారు సయీ. ప్రస్తుతం 'మేజర్' విజయం సాధించడంతో తెలుగులో మరింత బిజీ అవ్వాలని చూస్తున్నారు. నిజానికి 'మేజర్'లో సయీ కనిపించేది కాసేపే. కథలో స్పేస్ చాలా తక్కువ. అయినా కథలో పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి ఒప్పుకున్నానని చెబుతున్నారు సయీ.
ఎలాంటి లిమిట్స్ లేవు..
'నాకు ఎలాంటి లిమిట్స్ లేవు.. అలాగే ఎలాంటి కెరీర్ ప్లానింగ్ కూడా లేదు.. వచ్చిన అవకాశాలలో మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తాను' అని చెబుతారు సయీ మంజ్రేకర్. 'ప్రస్తుతం నేను అన్నిరకాల పాత్రలూ చేయాలని అనుకుంటున్నాను. తెలుగు, హిందీలోనే కాదు సౌత్‌లో అన్ని భాషల్లోనూ నటించాలని ఉంది. నా వరకూ వచ్చిన అవకాశాలలో మంచి ప్రాజెక్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ వెళ్తాను. తెలుగు ప్రేక్షకులందరూ నన్ను చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నా' అని చెప్పారు. 'అంతేకాదు.. ''కథ నచ్చితే ఏ భాషా చిత్రాన్నయినా ఓకే చేసేరు. భాషాపరమైన ఇబ్బందుల గురించి ఆలోచించొద్దు'' అని కెరీర్ ఆరంభంలో నాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను.' అని గతాన్ని గుర్తుచేసుకున్నారు.
అప్పట్లో ఎంతో బాధపడ్డా..
'చిన్నప్పుడు మా అమ్మతో కలిసి ప్రతి శుక్రవారం తాజ్ హోటల్‌కు వెళ్లేదాన్ని. అక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. 2008లో తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగిందని తెలిసి, అప్పట్లో ఎంతో బాధపడ్డా. ఇప్పుడు అదే కథతో తెరకెక్కిన 'మేజర్'లో నటించడం ఆశ్చర్యంగా అనిపించింది. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇలాంటి పవర్‌ఫుల్ చిత్రంతో నటించడం సంతోషంగా ఉంది.
తెలుగులో చేస్తానని ఊహించలేదు..
'తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. ఇక్కడ అంతా చాలా ఆప్యాయంగా వుంటారు. అందరూ డెడికేట్‌గా వర్క్ చేస్తారు. చాలా కష్టపడతారు. హైదరాబాద్ కల్చర్ నాకు చాలా నచ్చింది. గని-ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసి ఆనందానికి లోనయ్యా. అదొక ఫ్యాన్ మూవ్‌మెంట్. అంతేకాదు దబాంగ్ 3 ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప ఫీలింగ్‌నిచ్చింది. ఆ సమయంలో నేను తెలుగు సినిమాలు చేస్తానని అస్సలు ఊహించలేదు'.
వారు గొప్ప ప్రేమ, ఆప్యాయత ఉన్న వ్యక్తులు..
'తాజ్‌లో జరిగిన మేజర్ సందీప్ స్మారక కార్యక్రమంలో ఒకసారి ఆయన పేరెంట్స్‌ని కలిశాను. ఈ మధ్యనే బెంగళూర్‌లో జరిగిన 'మేజర్' ప్రివ్యూలో మళ్లీ కలిశాను. చాలా గొప్ప వ్యక్తులు. మేజర్ సందీప్ తల్లిని చూస్తే నా మదర్‌ని చూసినట్లే అనిపించింది. గొప్ప ప్రేమ, ఆప్యాయత వున్న వ్యక్తులు వాళ్లు. 'మేజర్' సినిమా గురించి మేజర్ సందీప్ కజిన్ ఒకరు ఇన్‌స్టాలో స్టొరీ పోస్ట్ చేశారు. అందులో నా పనితీరు సందీప్ తల్లి ధనలక్ష్మీ గారికి చాలా నచ్చిందని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా అనిపించింది. నా పనితీరు వారికి నచ్చింది. ఇంతకంటే ఏం కావాలి..?'
క్రమంగా కాన్ఫిడెన్స్ పెరిగింది..
'తెలుగు భాష విషయంలో కాస్త భయపడ్డా. క్రమంగా కాన్ఫిడెన్స్ పెరిగింది. స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆనందంగా వుంది. తెలుగు వెర్షన్ వైజాగ్‌లో చూశా. అసలు డబ్బింగ్ చెప్పింది నేనేనా అని నమ్మలేకపోయా. చాలా రోజుల క్రితమే డబ్బింగ్ పూర్తిచేశాను. మాట పలకడం, డిక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఒక్కసారిగా తెరపై చూసేసరికి చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. చాలా చక్కగా వచ్చింది. చిత్ర యూనిట్‌తో పాటు పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇకపై డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా. డైలాగ్స్ విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు. తెలుగు మాటని హిందీలో ఒత్తులు, దీర్ఘాలతో సహా సరిగ్గా రాసుకొని, పలకమనే వారు. ఇది తెలుగు సరిగ్గా పలకడానికి సహకరించింది.'
పూర్తిపేరు : సయీ ఎం మంజ్రేకర్
ఇతర పేర్లు : సాయి
పుట్టిన తేదీ : 1998, ఆగస్టు 29
పుట్టిన ప్రాంతం : ముంబై
చదువు : గ్రాడ్యుయేషన్
తల్లిదండ్రులు : మహేష్ మంజ్రేకర్,
మేధా మంజ్రేకర్
తోబుట్టువులు : సత్యా మంజ్రేకర్, అశ్వినీ మంజ్రేకర్