చేతికొచ్చిన పంటను నీట ముంచిన నివర్ తుపాను ప్రభావం ఇంకా పూర్తిగా పోక ముందే కొత్త తుపాన్లు వస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జనం గుండెలు గుభేలుమంటున్నాయి. నివర్ వల్ల దాదాపు పదిహేడున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని ప్రాథమిక సమాచారమనీ నష్టం ఇంకా పెరగవచ్చని శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. రంగు మారిన, మొలకలెత్తిన వరి ధాన్యం మొత్తాన్నీ రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ డిసెంబర్ 10 నాటికి పంట నష్టంపై ఎన్యూమరేషన్ పూర్తి చేసి నెలాఖరుకు రైతులకు పరిహారం అందించేలా షెడ్యూల్ రూపొందించామనీ శాసనసభలో ప్రకటించింది. కానీ ఆచరణలో ఎన్యూమరేషన్ మొదలు పరిహార చెల్లింపు వరకు, అదే విధంగా నాణ్యత తగ్గిన ధాన్యం కొనుగోలులోనూ ఎన్నో అవస్థలు పడవలసి వస్తుందన్న భయం రైతాంగాన్ని వెన్నాడుతోంది. పంట నష్టపోయిన కౌలు రైతులు మరింత బెంగటిల్లుతున్నారు. వాస్తవ సాగుదార్లు వారే అయినా ఇ-క్రాప్ తదితర కంప్యూటర్ ఆధారిత ప్రాతిపదికలతో ముడి పెట్టడం వల్ల కష్టాలు ఎక్కువగా వున్నాయి.
ఏ సీజన్‌లో జరిగిన నష్టాలకు ఆ సీజన్ లోనే పరిహారం ఇచ్చే విధానాన్ని తాము ప్రవేశ పెట్టామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి చెబుతుంటే ఒక సీజన్‌లో ఎన్ని సార్లు విపత్తులు సంభవించినప్పటికీ ఒక రైతుకు ఒక విపత్తుకు మాత్రమే పరిహారం అందుతుందన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పెద్ద ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి 'నివర్' వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ సర్కారు ఇచ్చే పెట్టుబడి రాయితీ అందాలంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సడలించాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయాలి. విపత్తులు ఎప్పుడు వస్తాయో ఎన్ని సార్లు వస్తాయో ఎవరికీ తెలియదు. అలాంటపుడు ఒక సారి మాత్రమే సర్కారు ఆదుకుంటుందన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన అమానవీయం, ప్రజా వ్యతిరేకం. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరుసగా పంట నష్టాలు సంభవించాయి. జూన్ మొదలు నవంబర్ వరకూ ప్రతి నెలలో కనీసం ఒకసారి భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. జూన్-జులైలో 8,443 హెక్టార్ల లోను, తిరిగి జులై-ఆగస్టు-సెప్టెంబర్‌లలో 73,664 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నాయి. అక్టోబర్‌లో, అదీ ఖరీఫ్ పంటలు కోతకొస్తున్న దశలో భారీ వర్షాలు ముంచెత్తడంతో 387 మండలాల్లో 2.12 లక్షల హెక్టార్లలో పంటలకు అపార నష్టం జరిగింది. ఉద్యానవన పంటలతోపాటు చేపలు, రొయ్యల చెరువుల రైతులూ నష్టపోయారు. నివర్ తుపాను 11 జిల్లాలపై ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఒకసారి పంట నష్ట పరిహారానికి అర్హత పొందిన రైతుల పంటలు మళ్లీ 'నివర్'కు సైతం దెబ్బ తింటే, అలాంటి వారికి పరిహారం అందదని అధికారులు చెబుతున్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినపుడు సహాయం అందించే విషయంలో మోడీ సర్కారు రాష్ట్రాల మధ్య తీవ్ర వివక్ష చూపుతోంది. భారీ వర్షాలు, వరదలతో ఘోరంగా నష్టపోయిన కేరళ రాష్ట్రానికి నామమాత్రపు సహాయాన్ని అందించింది. మహారాష్ట్ర విషయం లోనూ కేంద్ర ప్రభుత్వ తీరు అలాగే ఉంది. ఇటీవల భారీ వర్షాలతో ఇక్కట్ల పాలైన హైదరాబాద్ వాసులను ప్రధాని కానీ కేంద్ర హోం మంత్రి కానీ కన్నెత్తి చూడలేదు. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారానికి మాత్రం కేంద్ర మంత్రులు బారులు తీరారు. హుదూద్ తుపాను సమయం లోనూ ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రధాని ప్రకటించిన సహాయం ఇప్పటికీ అందని విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తుపాను బాధిత రైతాంగాన్ని ఆదుకొనేందుకు ఆటంకంగా ఉన్న నిబంధనలు సడలించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేకపోతే ఆ మేరకు తానే భరించి నష్టపోయిన అందరు రైతులకూ ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరిట వేధించకుండా రైతు తెచ్చిన పంటనంతా ప్రభుత్వ సంస్థలతో కొనిపించాలి. కంప్యూటర్ ఆధారిత ప్రాతిపదికలు కాకుండా ప్రత్యక్ష ఎన్యూమరేషన్ సమాచారం ప్రకారం పరిహారం అందించాలి. వాస్తవ సాగుదార్లయిన కౌలుదార్లను ఆదుకోవాలి. ''మాది రైతు పక్షపాత ప్రభుత్వం'' అని పాలకులు చెప్పేవన్నీ ఆచరించి చూపాల్సిన సమయమిదే !










