Jul 17,2021 20:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టే వినాశకర మూడు చట్టాలను రద్దు చేయాలని, పంటలకు మద్దతు ధర కల్పించేలా చట్టం తీసుకురావాలని రైతన్నలు చేస్తున్న డిమాండ్లను తక్షణమే పరిష్కరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఓటర్ల తరఫున పార్లమెంటు సభ్యులకు విప్‌ జారీ చేసింది. ఉభయ సభల్లో 'వాకౌట్‌' చేయకుండా ప్రజా సమస్యలపై గళమెత్తాలని కోరింది. శనివారం ఈ మేరకు ఎస్‌కెఎం నేతలు బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, డాక్టర్‌ దర్శన్‌ పాల్‌, హన్నన్‌ మొల్లా, జగ్జిత్‌ సింగ్‌ దల్లెవాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, శివకుమార్‌ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్‌ సింగ్‌, యోగేంద్ర యాదవ్‌ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22 నుండి పార్లమెంట్‌ మార్చ్‌లో పాల్గనేందుకు ఇప్పటికే తమిళనాడు తదితర సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ కార్మికులు బయల్దేరారని వారు తెలిపారు. హర్యానా పోలీసులు రైతులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సిర్సా వద్ద భారీ మహా పంచాయతీ విజయవంతమైంది. బిజెపి నాయకుడు మనీష్‌ గ్రోవర్‌ మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి జూలై 19న రోV్‌ాతక్‌లో మహిళా మహా పంచాయతీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చండీగఢ్‌ లో బిజెపి మేయర్‌ సంజరు టాండన్‌ వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అనాగరికంగా నిరసనకారులు, మహిళలు, పిల్లలతో సహా డజన్ల కొద్దీ అరెస్ట్‌ చేశారు.