Feb 08,2023 22:07

సోలార్‌ ప్రాజెక్టు

         అనంతపురం ప్రతినిధి : నిత్యం క్షామ పీడిత ప్రాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసి నష్టాలను చవిచూస్తున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఇక్కడ బతుకుదెరువు లేదంటూ బెంగళూరు, కేరళ తదితర రాష్ట్రాలకు పొట్టచేతబట్టుకుని వలసలు పోతున్నారు. ఇదిలాఉంటే ప్రకృతి వైపరిత్యం మరికొంత మందికి కాసులు కురిపించే విధంగా మారడం గమనార్హం. ఇక్కడి వర్షాభావ పరిస్థితులు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి వరంగా మారింది. ఎత్తు ప్రాంతంగా ఉండి గాలులకు మేఘాలు తెలిపోయి వర్షాలు పడని పరిస్థితులు నెలకుని ఉండగా, ఇది పవన విద్యుత్‌ ఉత్పత్తికి వరంగా మారింది. దీంతో ఇప్పుడు సోలార్‌, పవన విద్యుత్‌ కంపెనీల కన్ను అనంతపురం జిల్లాపై పడింది. పెద్దఎత్తున ఈ కంపెనీలు ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కాసులు కురిపించుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు సైతం ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో లక్షలాది ఎకరాల భూములు ఇప్పుడు కంపెనీల పరం కానున్నాయి.
4811.89 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో చూసినప్పుడు పవన, సోలార్‌ విద్యుత్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా జరుగుతున్న విద్యుత్‌ ఉత్పదాన 4811.89 మెగావాట్లుగా ఉంది. ఇందులో అనంతపురం జిల్లా పరిధిలో పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2628 మెగావాట్లు కాగా, సత్యసాయి జిల్లాలో 375.24 మెగావాట్లు ఉంది. ఇక అనంతపురం జిల్లా పరిధిలో సౌర విద్యుత్‌ 612.57 మెగావాట్లు కాగా, సత్యసాయి జిల్లా పరిధిలో 1193 మెగావాట్లు ఉంది. మొత్తంగా రెండు జిల్లాల పరిధిలో ఇప్పటికే 4811.89 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటై ఉన్నాయి.
పెద్దఎత్తున భూ కేటాయింపులకు రంగం సిద్ధం
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పుడిచ్చిన భూములే కాకుండా ఇంకా పెద్దఎత్తున భూ పందేరానికి ప్రభుత్వం సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల పరిధిలో పది వేల ఎకరాల వరకు గుర్తించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే నియోజకవర్గం పరిధిలో మొత్తం 75 వేల ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇకపోతే సత్యసాయి జిల్లా పరిధిలో తలుపుల, ఎన్‌పికుంట, కడప జిల్లాలోని చక్రయాపేట పరిధిలో మొత్తం 20 వేల ఎకరాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. ఓబుళదేవరచెరువు మండలం, నల్లమాడ, ఆమడగూరు మూడు మండలాల పరిధిలో 12 వేల ఎకరాలు సోలార్‌పార్కుకు అనుకూలంగా గుర్తించారు. కంబదూరు మండలం పరిధిలోని రాళ్ల అనంతపురం, రాళ్లపల్లి, కురాకులపల్లి గ్రామ పరిధిలో మరో 12 వేల ఎకరాలు అనుకూలంగానున్నట్టు గుర్తించారు. ఇలా అనేక చోట్లపెద్దఎత్తున సోలార్‌కు అనుకూలమైన భూమలున్నట్టు గుర్తించారు. వీటిని ముందుకొచ్చే కంపెనీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనది చెప్పవచ్చు.