Jun 10,2023 21:50

ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ఆనం వ్యాఖ్యలపై వైసిపి ధ్వజం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పార్టీలు మారుతూ, మారే సమయంలో అధికార పార్టీలను విమర్శిస్తూ సీనియర్‌ రాజకీయ నాయకునిగా భావితరాలకు చెప్పదల్చుకున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి చేజర్ల మండల వైసిపి నాయకులు అన్నారు. శనివారం చేజర్ల మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలోనే ప్రజలందరి కష్టాలు తెలుసుకుని నవరత్నాల పేరుతో మెనిఫెస్టోను సిద్ధం చేసుకుని ప్రజల ముందుకు వచ్చారన్నారు. ఆ సమయంలో పార్టీలో చేరిన వారిని పెద్దలుగా భావించి వెంకటగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేశారని, నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి పార్టీ వీడి వెళ్తూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తగదన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసునని, అంతటి అధికారంలో ఉండి కూడా సంగం వద్ద పెన్నా బ్యారేజీ నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని, హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణం ఎందుకు నత్తనడకన సాగిందని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ విమర్శించడం ఆనం స్థాయికి తగదని తెలిపారు. ముఖ్యమంత్రి అభివృద్ధి అందిరికీ తెలిసేలా చేశారన్నారు. మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో వారి కుటుంబం నుంచి వచ్చి శాసనసభ్యునిగా గెలుపొందిన మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్న బాటలోనే నడుస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికైన మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఆత్మకూరు డెవలప్‌మెంట్‌ ఫోరం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, ప్రతి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారని, జాబ్‌మేళాలు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే అనేక జాబ్‌మేళాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందచేస్తూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో అమలవుతుందన్నారు. పార్టీ నచ్చకుంటే వెళ్లిపోవచ్చునని, వెళ్లిపోయే సమయంలో ఇలా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ తూమాటి విజయభాస్కర్‌ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, జెడ్‌పిటిసి పీర్ల పార్థసారధి, నాయకులు పూనూరు గంగాధర్‌ రెడ్డి, మైనారిటి నాయకుడు రఫీ, మదమంచి వెంకటరత్నం, తిరుపతినాయుడు, రవీంద్రనాయుడు, తేళ్ల శేఖర్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకట రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, నోటి సుందరరామిరెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు తదితరులు ఉన్నారు.