May 04,2022 07:15
  • గుడిలోకి రానివ్వరు... రచ్చకట్టపై కూర్చోనివ్వరు
  • కర్నూలు జిల్లాలో దళితుల పట్ల అమానుషం
  • కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో 146 గ్రామాల్లో సర్వే
  • 89 గ్రామాల్లో బయటపడిన అమానవీయత

ప్రజాశక్తిా కర్నూలు ప్రతినిధి  : మనుషులు లేకుండా కార్లు నడిచే ఈ ఆధునిక యుగంలోనూ దళితుల పట్ల కులవివక్ష కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఇప్పటికీ దళితులు వివక్షకు గురవుతున్నారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో 13 మండలాల్లోని 146 గ్రామాల్లో కులవివక్షపై సర్వే నిర్వహించగా 89 గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష కొనసాగుతున్నట్లు తేలింది. దాదాపు 15 రకాల వివక్ష రూపాలు ఆయా గ్రామాల్లో కనిపిస్తున్నాయి. అత్యధికంగా 64 గ్రామాల్లో దళితులు దేవాలయ ప్రవేశాలకు నోచుకోవడం లేదు. 30 గ్రామాల్లో దళితులు రచ్చకట్టలపై కూర్చోడానికి వీల్లేదు. ఏడు గ్రామాల్లోని హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. ఆరు గ్రామాల్లో అసలు హోటళ్లల్లోకి దళితులను రానివ్వడం లేదు. 27 గ్రామాల్లో దళితుల బట్టలను రజకులు ఉతకడం లేదు. తొమ్మిది గ్రామాల్లో దళితులకు క్షవరం,  షేవింగ్‌ చేయడం లేదు. 16 గ్రామాల్లో పీర్ల పండగ సందర్భంగా దళితులు సావుసోని ఆడటానికి వీల్లేదు.
 

దేవాలయ ప్రవేశం నిషేధం
13 మండలాల్లోని 64 గ్రామాల్లో దళితులు దేవాలయాల్లోని వెళ్లటానికి వీల్లేదు. కొన్నిచోట్ల దర్గాల్లోకి కూడా అనుమతించడం లేదు. అత్యధికంగా దేవనకొండ, కౌతాళం మండలాల్లో పది గ్రామాల చొప్పున ఈ వివక్ష కనిపిస్తోంది. కర్నూలు మండలంలోని దిగువపాడు, ఆర్‌కె దుద్యాల, తులశాపురం, ఎదురూరు, గొందిపర్ల, దేవమాడ, ఆదోని మండలంలోని దిబ్బనకల్‌, నాగనాథహల్లి, అలసందగుత్తి, గోనబావి, సలకలకొండ, ఇస్వి, పత్తికొండ మండలంలోని పందికోన, కొత్తపల్లి, పుచ్చకాయలమాడ, చిన్నహుల్తి, అటికలగుండు, నలకదొడ్డి, పులికొండ, కనకదిన్నె, దూదేకొండ, మంత్రాలయం మండలంలోని వగురూరు, కల్లూరు మండలంలోని పెద్దపాడు, ఎ.గోకులపాడు, రేమడూరు, కె.మార్కాపురం, దేవనకొండ మండలంలోని చెల్లిలిచెలిమిల, బేతపల్లి, ఓబుళాపురం, బండపల్లి, బంటుపల్లి, కె.వెంకటాపురం, గుండ్లకొండ, గుమిడిరాల్ల, జిల్లేడు బుడకల, మాదాపురంలో దళితులను దేవాలయాల్లోకి రానివ్వడం లేదు. ఓర్వకల్లు మండలంలోని లద్దిపల్లె, ఉయ్యాలవాడ, తిప్పాయిపల్లె, కోసిగి మండలం పెద్ద భూంపల్లి, కౌతాళం మండలంలోని అగసలదిన్నె, చిరుతపల్లి, సుళేకేరి, ఉరుకుంద, లింగాలదిన్నె, మదిరి 173, కాత్రికి, పొదలకుంట, మల్లనహట్టి, కరిణి, ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి, గుడికల్‌, సంతనాగలాపురం, గోనేగండ్ల మండలంలోని ఎర్రబాడు, ఒంటెడుదిన్నె, గాజులదిన్నె, ఐరన్‌బండ, నందవరం మండలంలోని పొరకలదిన్నె, టి.సోమలగూడూరు, పూలచింత, గురజాల, ఆలహర్వి, కనకవీడు, పెద్దకడబూరు మండలం కంబదహాల్‌లోనూ దళితులకు ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించడం లేదు.
 

                                                     ఇప్పటికీ రెండు గ్లాసుల విధానం

తరాలుమారినా ఇప్పటికీ ఏడు గ్రామాల్లోని హోటళ్లలో రెండు గ్లాసుల విధానం కొనసాగుతోంది. కర్నూలు మండలం దేవమాడ, ఆదోని మండలం సలకలకొండ, మంత్రాలయం మండలం వగురూరు, కౌతాళం మండలం లింగాలదిన్నె, మదిరి 173లో దళితుల కోసం ప్రత్యేక గ్లాసులు పెట్టారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ, నందవరం మండలం రాయచోటిలో దళితులకు నీటిని ప్రత్యేక మగ్గుల్లో ఇస్తున్నారు. కర్నూలు మండలం తులశాపురం, పత్తికొండ మండలం కొత్తపల్లి, పుచ్చకాయలమాడ, ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లె, కౌతాళం మండలం అగసలదిన్నె, సుళేకేరిలో దళితులను హోటళ్లలోకి రానివ్వడం లేదు.
 

                                                       క్షవరం, షేవింగ్‌ చేయడం లేదు

సర్వే చేసిన గ్రామాల్లోని తొమ్మిది గ్రామాల్లో దళితులకు క్షవరం, షేవింగ్‌ చేయడం లేదు. కర్నూలు మండలం దేవమాడ, ఆదోని మండలం నాగనాథహల్లి, పత్తికొండ మండలం కొత్తపల్లి, కల్లూరు మండలం రేమడూరు, కౌతాళం మండలం మదిరి 173, లింగాలదిన్నె, కాత్రికి, పొదలకుంట, మల్లనహట్టిలో ఈ వివక్ష కొనసాగుతోంది. ఆయా గ్రామాల దళితులు క్షవరం, సేవింగ్‌ కోసం పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. .
 

                                                                 బట్టలు ఉతకరు

27 గ్రామాల్లో దళితుల బట్టలను రజకులు ఉతకడం లేదు. కర్నూలు మండలంలోని మూడు, ఆదోని మండలంలోని నాలుగు, కోసిగి మండలంలోని ఐదు, కౌతాళం, పెద్దకడబూరు మండలాల్లోని ఏడు, మంత్రాలయం మండలంలోని ఒక గ్రామంలో ఈ వివక్ష కనపడుతోంది.
 

                                                       మఠంలో ఏ పనికీ పెట్టుకోరు

మంత్రాలయంలోని రాఘవేంద్ర మఠంలో గుడిలో ఏ పనికీ దళితులను పెట్టుకోవడం లేదు. చివరకు మఠంలో ఊడ్చేవాళ్లు కూడా దళితులు కారు. మఠం పరిధిలో ఉన్న దాదాపు 300 లాడ్జీలలో డిగ్రీ చదువుకున్న దళితులైనా కేవలం ఊడ్చడానికి మాత్రమే అర్హులు. స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు లీజుకు తీసుకుని హోటల్‌గా మార్చారు. అందులో కొందరు దళిత యువకులను సూపర్‌వైజర్లుగా, బిల్లులు రాసే వాళ్లుగా, రిసెప్షనిస్టులుగా తీసుకుని పని చేయించుకుంటుంటే మఠం స్వాములు కలగజేసుకుని వాళ్లందరినీ తొలగించారు. అందులోనే కసువు ఊడ్చేవాళ్లుగా వారిని తీసుకున్నారు. దానిపై ఫిర్యాదు ఇవ్వడానికి దళితులు భయపడుతున్నారు.
 

                                                   విచిత్రమైన రూపాల్లో వివక్ష...

  • పలు గ్రామాల్లో విచిత్రమైన వివక్ష రూపాలు ఇంకా కొనసాగుతున్నాయి.
  • పెద్దకడబూరు మండలం మేకడోణ, నెమిలేకల్‌, బసలదొడ్డిలో దళితులను మోటర్‌ సైకిళ్లపై తిరగనివ్వరు.
  • గోనేగండ్ల మండలం గాజులదిన్నెలో దళితుల పెళ్లి ఊరేగింపులు నిషేధం.
  • ఆదోని మండలం అలసందగుత్తి, పత్తికొండ మండలం పందికోన, మంత్రాలయం మండలం వగురూరు, గోనేగండ్ల మండలం ఎర్రబాడు, దేవనకొండ మండలం జిల్లేడుబుడకల, కోసిగి మండలం జంపాపురంలో దళితుల పెళ్లి ఊరేగింపు దళిత పేటలకే పరిమితం కావాలి.
  • మంత్రాలయం మండలం వగురూరులో దళితులను ఇతరుల బావుల్లోకి దిగనివ్వరు.
  • మంత్రాలయం మండలం బసాపురంలో పెత్తందారుల కార్లు వస్తే ఎంత చదువుకున్న దళితులైనా లేచి నిలబడి నమస్కారం పెట్టాల్సిందే.
  • పత్తికొండ మండలం కొత్తపల్లి, దేవనకొండ మండలం బేతపల్లిలో బండిపై పెళ్లి ఊరేగింపు చేయనివ్వరు.
  • కర్నూలు మండలం దేవమాడలో గ్రామవలంటీర్‌ దళితుల ఇళ్ల దగ్గరకు వెళ్లడు. వారినే తన ఇంటి వద్దకు పిలిపించుకుంటాడు.
  • కోసిగి మండలం జంపాపురంలో ఇతరులు దళితులతో కలిసి సహఫంక్తి భోజనం చేయరు.

                                                    వివక్ష నిర్మూలనకు కృషి చేయాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండగానే రాష్ట్రంలో దళితులపై అత్యధికంగా దాడులు జరుగుతున్న, అంటరానితనాన్ని చూపుతున్న జిల్లాల్లో కర్నూలు జిల్లా మూడో జిల్లాగా ఉందని ఆనాటి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పున్నయ్య పేర్కొన్నారు. ఈ జిల్లాకు ప్రత్యేక ఐఎఎస్‌ అధికారిని కేటాయించి ప్రత్యేక దృష్టితో దళితుల సమస్యలను పరిష్కరించాలని సిఫార్సు చేశారు. ఇప్పటి వరకూ అటువంటి ప్రయత్నం చేయకపోవడంతో నేటికీ గ్రామాల్లో వివక్ష కొనసాగుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పున్ణ పరిశీలన చేయించి, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పోలీసు, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖలు సంయుక్తంగా వివక్ష నిర్మూలనకు కృషి చేయాలి. కోడుమూరు మండలం అనుకొండ గ్రామంలో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ప్రతిఘటన కార్యక్రమం నిర్వహించాం. ప్రధానంగా క్షౌరశాలలో దళితునికి క్షౌవరం చేయించిన తరువాత ఇప్పటి వరకు ఆ క్షౌర శాలకు మైలపడిందని తెరవనీయడం లేదు.
                                    - ఎండి ఆనంద్‌బాబు, కెవిపిఎస్‌ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి