Feb 11,2023 17:39

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు

 రాయచోటి టౌన్‌ : వివిధ జిల్లాలలో గత మూడు నెలలుగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగను మొలకలచెరువు పోలీసులు పక్క ప్రాణాలికతో అరెస్టు చేసినట్లు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. శనివారం ఎస్‌పి మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు వెళ్లడించారు. కడప జిల్లా అంగడి వీధికి చెందిన పొలం ధనకుమార్‌, ఎల్లనూరు రోడ్డు బిందిలోల్ల కాలనీ తాడిపత్రిలో నివాసముంటూ అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో చోరీలకు పాల్పడుతూ ఉండేవాడని తెలిపారు. ఇతనిపై ఆయా జిల్లాలలో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కదిరి, ప్రొద్దుటూరు పట్టణాలలో ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ షోరూమ్‌లో 20 టైర్లు, మదనపల్లి పట్టణంలో ఎలక్ట్రిక్‌,పెయింట్‌ షో రూమ్‌ లలో 142 కేజీల కాపర్‌ వైరు, రూ.2.25 లక్షల నగదు దొంగిలినట్లు తెలిపారు. పీలేరు, ఎలక్ట్రిక్‌ షోరూంలో 22 కాపర్‌ వైన్డింగ్‌ బాక్సులు, మొలకలచెరువు ఎలక్ట్రికల్‌ షోరూమ్‌లో 25 కాపర్‌ వైన్డింగ్‌ బాక్సులు చోరీ చేశాడని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దొంగను పట్టుకోవడానికి ములకలచెరువు సిఐ సాధిక్‌ అలీ నేతత్యంలో స్పెషల్‌ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాగైనా కేసును చేదించాలని ఉద్దేశంతో సిబ్బంది గత మూడు నెలల్లో వివిధ జిల్లాలలో జరిగిన చోరీల ఆధారంగా ముద్దాయి ధనకుమార్‌ పై నిఘా ఉంచి నట్లు పేర్కొన్నారు. పక్కా సమాచారంతో మదనపల్లికి దొంగతనానికి పాల్పడానికి పరికరాలతో వెళ్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుడు ఎంతో జాగ్రత్తగా పోలీసులకు దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖానికి మంకీ క్యాప్‌ ధరించడం, చేతులకు బ్లౌజులు వాడడం, సిసి కెమెరాలు ధ్వంసం చేయడం, డివిఆర్‌ బాక్సులను వెంట తీసుకువెళ్లడం చేస్తుండేవాడని చెప్పారు. పోలీసు సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అతను నివాసం ఉన్న తాడిపత్రిలో వేరే జిల్లాలలో దొంగలించిన 16 లారీ టైర్లు, 25 కాపర్‌ వైన్డింగ్‌ బాక్సులు, ఒక బొలెరో వాహనం, చోరీలకు ఉపయోగ పడే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని తెలిపారు. చాక చక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని నగదుతో అభినందించారు. కార్యక్రమంలో ములకలచెరువు ఎస్‌ఐ డివై.స్వామి, కానిస్టేబుళ్లు వెంకటేష్‌, సిరాజ్‌ బాషా, తాతయ్య, శివకుమార్‌ పాల్గొన్నారు.