న్యూఢిల్లీ : బక్రీద్ వేడుకల నిమిత్తం కోవిడ్-19 ఆంక్షలను ఎందుకు సడలించారో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. బక్రీద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు ఆంక్షలను సడలించడాన్ని సవాల్ చేస్తూ పికెడి నాయర్ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్‌ఎఫ్.నారీమన్, బిఆర్ గవారులతో కూడిన ధర్మాసనం పిల్‌కు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. స్పందించిన కేరళ ప్రభుత్వ తరపు న్యాయవాది జి.ప్రకాశ్.. నియంత్రిత పద్ధతిలో కొన్ని దుకాణాలకే అనుమతి ఇచ్చామని తెలిపారు. ఆంక్షల సడలింపుపై అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పగా, తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో కన్వర్ యాత్రను ఈ ఏడాదికి నిలిపేస్తున్నామని రాష్ట్రప్రభుత్వం సమాచారం ఇవ్వడంతో న్యాయస్థానం తన సుమోటో కేసును మూసివేసింది.










