Apr 25,2023 21:22

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలలో నిబద్ధత, అంకితభావంతో లక్ష్యసాధనకు కషి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మండల ఇంజినీరింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్‌డిఒలతో గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, రీసర్వే, గ్రామ వార్డు సచివాలయ సేవలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతప్త స్థాయిలో అందించడమే ప్రభుత్వ ఆశయమన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పథకాలు అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు స్పందన సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మండలాల్లో అందిన అర్జీలను సరైన రీతిలో పరిష్కారం చూపుతున్నారా లేక ఎక్కువగా రీ ఓపెన్‌ అవుతున్నాయా అన్న అంశాలను ఆర్‌డిఒ స్వయంగా పరిశీలించాలన్నారు. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మంజూరైన ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటిని పూర్తి చేసుకునేలా అధికారులు తమ వంతు తోడ్పాటు అందించాలన్నారు. సొంత స్థలాలలో గహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు సంబంధించిన ఇకెవైసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సంక్షేమ కార్యదర్శులు, వాలంటీర్లు ఇకెవైసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గహ నిర్మాణానికి సంబంధించిన నరేగా పనులను వందశాతం చేయాలన్నారు. నగరాల్లో కూలీలకు పని కల్పించడంలో 8 మండలాలు వెనుకబడి ఉన్నాయని, అక్కడ వెంటనే ప్రగతి సాధించేలా దష్టి సారించాలని పేర్కొన్నారు. జగనన్న లేఅవుట్‌ కాలనీలలో మౌలిక వసతులను త్వరగా పూర్తిచేసేలా హౌసింగ్‌, ఆర్డబ్ల్యూఎస్‌, విద్యుత్తు, రెవెన్యూ, డ్వామా శాఖలు బాధ్యత వహించాలని, లక్ష్యసాధనలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. రీ సర్వేలో భాగంగా వెబ్‌ ల్యాండ్‌లో ఎల్‌పిఎం ఖాతాలకు ఫొటోలను ఎప్పటికప్పుడూ అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. వెబ్‌ ల్యాండ్‌ లో ప్రభుత్వ భూములకు ఫొటోస్‌ అప్లోడ్‌ చేయాలని వస్తోందని, క్షేత్రస్థాయిలో మరల పరిశీలన చేసి వాటిని సరి చేయాలని పేర్కొన్నారు.. ఏదైనా సమస్యతో అర్జీదారుడు వచ్చినప్పుడు వాటిని బాధ్యతాయుతంగా పరిష్కరించాలని, దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఎఒ బాలకష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.