ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్య సాయి జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న జిల్లా అధికారులు తమ శాఖల పట్ల శ్రద్ధతో పనిచేస్తూ క్రింది స్థాయి ఉద్యోగులతో పని చేయించాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లాలోని పలు శాఖలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు జిల్లా కార్యాలయాలలో నెలకొనన పలు అసౌకర్యాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జిల్లా కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. తొలుత జిల్లా వైద్యాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి కార్యాలయానికి వెళ్లి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని సౌకర్యాలను పరిశీలించారు. పక్కనే ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం, అనుబంధ శాఖలను తనిఖీ చేసి వ్యవసాయ అధికారి సుబ్బారావుతో పలు విషయాలను చర్చించారు. రైతులకు విత్తనాలను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పనితీరును పరిశీలించాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిక సంస్థ, డిఆర్‌డిఎ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంబంధించిన అనుబంధ శాఖల కార్యాలయాలను సందర్శించారు. పుట్టపర్తి రెవెన్యూ కార్యాలనికి వెళ్లి అక్కడి ఉద్యోగస్తులకు కేటాయించిన గదులను పరిశీలించారు. రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో భాగ్యరేఖకు సూచించారు. పుట్టపర్తి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగస్తులు వివరాలు వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకొని రికార్డుల గది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, డిప్యూటీ తహశీల్దార్ నరసింహులు, కలెక్టర్ సిసి తదితరులు పాల్గొన్నారు.










