పారిశ్రామిక రంగంలో 25, వ్యవసాయ రంగంలో 14.50 శాతం
రూ.2 లక్షలు దాటిన తలసరి ఆదాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలో వివిధ రంగాల్లో నమోదైన వృద్ధిపై ప్రణాళికశాఖ తనదైన శైలిలో గణాంకాలు సిద్ధం చేసింది. పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాల్లో వృద్ధి అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది. అన్నిటికన్నా పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పెరిగినట్లు పేర్కొనడం గమనార్హం. తాజాగా వెల్లడించిన వృద్ధి గణాంకాలపై విశ్లేషణ మాత్రం కనిపించలేదు. ఇవే గణాంకాలను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తాజా ధరల మేరకు పారిశ్రామిక రంగంలో ఏకంగా 25.58 శాతం వృద్ధి నెలకొన్నట్లు ప్రకటించారు. గత ఆరేళ్లలో ఇంత వృద్ధి చూపించడం ఇదే తొలిసారి. 2016- 17లో 11 శాతం వృద్ధి కనిపించగా, 2019-20లో 4.36 శాతం ఉండగా, గతేడాది 0.40 శాతానికి పడిపోయినట్లు చూపించారు. అయితే ఒక్కసారి 0.40 శాతం నుంచి పాతిక శాతానికిపైగా వృద్ధి పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే పారిశ్రామిక విలువ కూడా రూ.1.97 లక్షల కోట్ల నుంచి రూ.2.48 లక్షల కోట్లకు పెరిగినట్లు చూపించారు. వ్యవసాయ రంగంలో కూడా వృద్ధి 14.50 శాతంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో విలువ 3.93 లక్షల కోట్లుగా చూపించడం గమనార్హం. గతేడాది కన్నా దాదాపు 4 శాతం వృద్ధి పెరిగింది. కీలకమైన సేవా రంగంలో ఒక్కసారిగా వృద్ధి పైపైకి చేరుకున్నట్లు ప్రణాళికశాఖ పేర్కొంది. గతేడాది రూ.3.92 లక్షల కోట్లతో 4.58 శాతం వృద్ధి నమోదుకాగా, ఈ ఏడాది 18.91 శాతంతో రూ.4.66 లక్షల కోట్లుగా విలువను గణించారు.
జిఎస్‌డిపి పైపైకి...
స్థూల జాతీయోత్పత్తి కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. గతేడాది రూ.10,14,374 కోట్లుగా ఉన్న జిఎస్‌డిపి ఈ ఏడాది ఏకంగా 18.47 శాతం పెరిగి రూ.12,01,736 కోట్లకు చేరిపోయినట్లు గణాంకాలు సిద్ధం చేశారు. జివిఎ కూడా 18.70 శాతం వృద్ధితో రూ.11,08,086 కోట్లకు చేరిందని అధికారులు ప్రకటించారు.
తలసరి ఆదాయం రూ.2 లక్షలు పైనే
అత్యంత కీలకమైన తలసరి ఆదాయం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. గతేడాది రూ.1,76,707 ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ.2,07,771కు చేరిపోయిందని ప్రణాళికశాఖ పేర్కొంది. గతేడాది కన్నా ఇది 17.58 శాతం అధికంగా తేల్చారు. వాస్తవానికి కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు క్షీణించిపోయినప్పటికీ నేరుగా నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల ఆదాయం పెరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటీ అత్యంత ధనికులు, నిరుపేదల ఆదాయాన్ని కలిపి సగటును గుర్తించడం వల్లనే తలసరి రూ.రెండు లక్షలు దాటిపోయినట్లు కనిపిస్తోందని అధికారులే అంగీకరిస్తున్నారు










