పట్టువస్త్రాలు సమర్పించిన కడప మేయర్
గంగమ్మను దర్శించుకున్న డిప్యూటీ సిఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి: రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే అనంతపురం గంగమ్మ జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరను ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి తదితర నాయకులుతో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేష్ బాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన నేతలకు కమిటీ చైర్మన్, సభ్యులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పూజారులు నేతలకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం గంగమ్మ ఆలయ ఖ్యాతిని మరింత పెంపొందిస్తామని పేర్కొన్నారు. గంగమ్మ ఆలయ వెనుక భాగంలో రాజగోపురం, కోనేరు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అనంతపురం గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. జాతర విజయ వంతానికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ, దాతలు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, స్థానిక గ్రామాల ప్రజలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సామాల నరసింహారెడ్డి, సర్పంచ్ వెంకటనారాయణరెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి రవీంద్ర రాజు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మందాడి వెంకటేశ్వర్లు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.










