Feb 24,2022 07:15

అంగన్‌వాడీలకు, ఆశాలకు ఉన్న ఎజెండా ఏమిటో 2016 నుండి 2018 వరకు 'సాక్షి' పత్రిక తిరగేస్తే తెలుస్తుంది. అధికార పార్టీ మెప్పు కోసం అసత్య వార్తలతో అంగన్‌వాడీలను అవమానించే విధంగా రాయడం తగదు.

అంగన్‌వాడీలకు ఉన్న ఏకైక ఎజెండా ఐసిడిఎస్‌ ను బలోపేతం చేయడం, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం. దీనికోసం 1990 నుండి సిఐటియు అనుబంధంగా యూనియన్‌ పెట్టుకొని అధికారంలో ఏ జెండాలున్నా (పసుపు, నీలం,...) వాటితో నిమిత్తం లేకుండా అంగన్‌వాడీలు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు అంగన్‌వాడీల మీద ఉక్కుపాదం మోపాయి. అక్రమంగా కేసులు పెట్టారు. గృహ నిర్బంధాలు చేశారు. గుర్రాలతో తొక్కించారు. బస్సులు, రైళ్ల నుండి దించేశారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించారు. కుటుంబ సభ్యులనూ వదలలేదు. ఐనా మొక్కవోని దీక్షతో సిఐటియు జెండా నీడలో దశల వారీగా జరిగిన పోరాటాల ఫలితంగా అంగన్‌వాడీ వర్కర్‌కు రూ. 150 నుండి రూ. 11,500, మినీ హెల్పర్‌కు రూ. 75 నుండి రూ. 7000 లకు వేతనాలు పెంచుకోగలిగారు. మెటర్నిటీ లీవ్‌, హెల్పర్ల ప్రమోషన్లు, గ్రెడ్‌-2 సూపర్‌వైజర్ల జీవోలు, సెంటర్‌ అద్దెలు, టి.ఎ బిల్లులు...సాధించుకున్నారు. అందుకనే అంగన్‌వాడీలు సిఐటియు జెండాను తల్లి తరువాత తల్లిలా భావించి గుండెల్లో దాచుకుంటున్నారు. ఆశా కార్యకర్తలూ అంతే. అంగన్‌వాడీలు, ఆశాలు ఆందోళనబాట ఎందుకు పడుతున్నారో వాస్తవాలు గమనించడం మంచిది.

అంగన్‌వాడీల మీద వేధింపులు
గత రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల పోరాటానికి దిగివచ్చి, 2016, 2018లో కొంత వేతనాలు పెంచినా...అంగన్‌వాడీలను చీల్చడం, రకరకాల వేధింపులకు గురిచేయడం, పని భారం పెంచడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దాంతో ప్రభుత్వం మారితే అంగన్‌వాడీల కష్టాలు తీరతాయని భావించి అనేకమంది వైసిపికి ఓట్లు వేశారు. వైసిపి ప్రభుత్వం కూడా అంగన్‌వాడీలను అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నది. కొన్నిచోట్ల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమ వాళ్ళను పెట్టుకోవాలని అంగన్‌వాడీలను తొలిగించే ప్రయత్నం చేశారు. కడప రూరల్‌ ప్రాజెక్టు బుగ్గలవారిపల్లి హెల్పర్‌ నాగమ్మ వైసిపి నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. మాచర్ల ప్రాజెక్టులో వర్కర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించింది. చెన్నె కొత్తపల్లి ప్రాజెక్టులో సునీత బలవన్మరణానికి పాల్పడబోయింది. ఇంకా అనేకమంది హెల్పర్లకి ప్రమోషన్లు రాకుండా అడ్డుపడుతున్నారు. 90 శాతం ఫోన్లు చెడిపోయినవైనా, సిగల్స్‌ లేకపోయినా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. 2017 నుండి టి.ఎ బిల్లులు ఇవ్వలేదు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు, గ్యాస్‌ బిల్లులు, సెంటర్‌ అద్దెలు నెలనెలా ఇవ్వనందున అంగన్‌వాడీలే అప్పులు చేసి సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అంగన్‌వాడీల ప్రీ స్కూల్‌ ట్రైనింగ్‌ల దగ్గర అధికార్ల మీద ఒత్తిడి తెచ్చి సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేయిస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు.

మాట తప్పను.... అంటూ
ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన పిఆర్‌సి లో 30 శాతం వేతనాలను అంగన్‌వాడీలకూ పెంచారు. జీవో నెం.42 ద్వారా 2020-2021 జులై నుండి వర్కర్‌కు రూ.13,650, హెల్పర్‌, మినీ వర్కర్‌కు రూ.7600 అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో పిఆర్‌సిలో అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదు. మ్యానిఫెస్టో అమలు చేస్తే వర్కర్‌కు నెలకు రూ. 14,650, మినీ వర్కర్‌కు రూ. 8,600 ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో వారికి ఇస్తున్నది వరుసగా రూ. 11,500, మినీ వర్కర్‌కు రూ. 7,000 మాత్రమే. మాట తప్పను, మడమ తిప్పను... అంటే ఇదేనా? పైపెచ్చు వర్కర్‌కు రూ.7 వేల నుండి రూ.11,500, హెల్పర్‌, మినీ వర్కర్‌కు 4,500 నుండి రూ.7000 లకు వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాతనే పెంచామని అధికార పార్టీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.

ఎన్‌.ఇ.పి తో అంగన్‌వాడీలకు ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలోనే 2020లో నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఇపి) తీసుకువచ్చింది. ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా ప్రీ స్కూల్‌ను ఎలిమెంట్రీ స్కూళ్లకు అనుసంధానం చెయ్యాలని నిర్ణయించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఎన్‌.ఇ.పి అమలు చెయ్యలేమని అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాని మన రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందరికీ అందిస్తున్నామంటూ ఎన్‌.ఇ.పి ని అమలు చెయ్యటానికి సర్క్యులర్‌ 172 తీసుకు వచ్చారు. కిలోమీటర్‌ లోపు ఉన్న అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో కలపాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ సెంటర్లలో పిపి1, పిపి2, ప్రాథమిక పాఠశాలల్లోని 1,2 తరగతులు కలిపి ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చెయ్యాలని హడావుడి చేసినా... దశలవారీ పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ప్రమాదం పొంచి ఉన్నది.

సంక్షేమ పథకాల కోత, ప్రమోషన్ల వాత
రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. కాని ఆశాలకు, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యటంలేదు. అంతకు ముందున్న తెల్ల కార్డులనూ రద్దు చేశారు. వారి కుటుంబ సభ్యులకు అందే పెన్షన్లను సైతం రద్దు చేస్తున్నారు. ఏమని అంటే మీరు ప్రభుత్వోద్యోగులు అని అంటారు. కాని పే స్కేలు కాదు సరికదా ప్రభుత్వోద్యోగులకుండే ఏ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వడం లేదు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్సుగా సేవలందించిన ఆశా, అంగన్‌వాడీ ఉద్యోగులు మరణించినా వారికి బీమా సొమ్ము ఇవ్వలేదు. ఇలాంటివెన్నో కష్టాలు.

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణకు మెనూ చార్జీలు పెంచలేదు. అంగన్‌వాడీ సెంటర్లలో వర్కర్‌ పోస్టు ఖాళీ అయితే అదే సెంటర్లో హెల్పరు అర్హురాలు అయితే ఆమెకు ప్రమోషన్‌ ఇవ్వాలని జీవో ఉంది. కాని కొన్ని ప్రాంతాల్లో వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వాళ్లను పెట్టుకోవాల్సిందిగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అక్రమంగా నోటిఫికేషన్‌ వేయిస్తున్నారు. 400 జనాభా దాటిన సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి. కాని రాష్ట్రంలో అనేక ప్రాంతాలో వెయ్యి, పన్నెండు వందల జనాభా ఉన్న చోట కూడా మినీ సెంటర్లుగానే నడుస్తున్నాయి. హెల్పర్‌ పని చేసినప్పటికీ వర్కర్‌కు హెల్పర్‌ వేతనమే ఇస్తున్నారు. 2017 నుండి టి.ఎ బిల్లులు ఇవ్వలేదు. సెంటర్‌ అద్దెలు, గ్యాస్‌ బిల్లులు పెండింగ్‌ లోనే ఉన్నాయి.

రిటైర్‌ అయినవారిని పట్టించుకోరా?
పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు దాదాపు 47 సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న అంగన్‌వాడీలను... 60 సంవత్సరాల వయసు దాటినప్పుడు రిటైర్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హెల్పర్‌కు కేవలం రూ.20 వేలు, వర్కర్‌కు రూ.50 వేలు ఇస్తామని ప్రకటించారు. 2021 మార్చి నుండి ఇంత వరకు రిటైర్మెంట్‌ డబ్బులు రాలేదు. ఎటువంటి పెన్షన్‌ ఇవ్వటంలేదు. ఆశా కార్యకర్తలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా రిటైర్‌ చేస్తున్నారు. కాని పాండిచ్చేరి లో అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. తమిళనాడులో అంగన్‌వాడీలకు బేసిక్‌ హెచ్‌ఆర్‌ఎ, డి.ఎ, హెల్త్‌ అలవెన్స్‌తో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.1,60,000, పెన్షన్‌ రూ.2000 ఇస్తున్నారు. కేరళలో వర్కర్‌కు రూ.2500, హెల్పర్‌కు రూ.1600 పెన్షన్‌ ఇస్తున్నారు. కర్ణాటకలో హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు అంగీకరించారు. కాని మన రాష్ట్రంలో వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాల్సిందిగా ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితంలేదు. ఆశా, అంగన్వాడీలు సర్వీసులో మరణిస్తే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడంలేదు.

సమస్యలు పరిష్కరించమన్నందుకు నిర్బంధం
అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి, మహిళా శిశు సంక్షేమ మంత్రి, అధికార్లకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దాంతో అనివార్యంగా ఫిబ్రవరి 21 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయాలని యూనియన్‌ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కును కూడా కాలరాస్తూ ప్రభుత్వం ఆశాలు, అంగన్‌వాడీల మీద పలు రకాలుగా నిర్బంధాన్ని ప్రయోగించింది. అన్ని జిల్లా, ప్రాజెక్టు నాయకులను గృహ నిర్బంధాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద పాకిస్తాన్‌ బోర్డర్‌ను తలపించేలా పోలీసులను మోహరింపచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్‌వాడీలను రోడ్ల మీద ఈడ్చిపడేశారు. ప్రకాశం జిల్లాలో పోలీసు అధికారి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పిడిగుద్దులు గుద్ది నోటికి వచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ధర్నాకు వచ్చేవారిని బస్సుల నుండి వాహనాల నుండి దించేసి అరెస్టులు చేశారు. సమస్యల పరిష్కారం కోరుతున్న అంగన్‌వాడీల పట్ల అవమానకరంగా వ్యవహరించడం విజ్ఞత కాదు. ఇప్పటికైనా... వారి ఆవేదనను, అసంతృప్తిని అర్ధం చేసుకోవాలి. ఎర్ర జెండా-ఎల్లో ఎజెండా లాంటి అబద్ధపు ప్రచారం మానుకోవాలి. వాస్తవాలు గుర్తెరిగి ఆశా, అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఆలోచన చేయాలి.

అంగన్‌వాడీలు, ఆశాలు - వాస్తవాలు

కె. సుబ్బరావమ్మ
/ వ్యాసకర్త : ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, సెల్‌ : 9490300341 /