సమగ్ర శిశుఅభివృద్ధి పథకం (ఐసిడిఎస్) ద్వారా దేశవ్యాప్తంగా 6 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రీ స్కూల్ విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగ నిరోధకత వంటి సేవలు అందుతున్నాయి. పిల్లల మానసిక, శారీరక, సామాజిక అభివృద్ధికి పునాది వేయడం, మాతా శిశు మరణాల నియంత్రణ, పోషకాహార లోపం, పాఠశాల డ్రాపౌట్లు వంటి వాటిని తగ్గించడం ఈ పథకం విశిష్టత. అంగన్‌వాడీల వలన కొంత మేరకైనా అభివృద్ధి సాధించగలుగుతున్నామని గత 45 సంవత్సరాల అనుభవాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'నూతన విద్యా విధానం' ఐసిడిఎస్ లక్ష్యాలను ప్రశ్నార్ధకం చేస్తున్నది.
బాలల మెదడు 6 సంవత్సరాలకు ముందే 85 శాతం అభివృద్ధి చెందుతుందన్న శాస్త్రవేత్తలు, నిపుణుల పరిశోధనల ఆధారంగా...పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా ఉండాలనేది రూపొందించారు. యునిసెఫ్ ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశ పెట్టడం వలన ఫలితాలు బాగుంటాయని అనేక రిపోర్టులు సైతం తెలియజేశాయి. వాస్తవానికది మన దేశంలో కార్యరూపం దాల్చలేదు. ప్రీ ప్రైమరీ కేంద్రాలు నడపాలన్న డిమాండ్ చాలా కాలం నుండి ఉంది. మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ఐసిడిఎస్ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీ ప్రైమరీ విద్యను నిర్వహించడం సరైనదేన అన్నది నిరూపణ అయిన అంశం. కానీ, నేడు కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)... అంగన్‌వాడీ కేంద్రాల లోని పూర్వ శిశు కేంద్రాలను 1,2 తరగతులతో కలిపి విద్యా బోధన చేయాలన్న అంశాన్ని తీసుకొచ్చింది. ఇది చాలా అశాస్త్రీయమైనది. మూడు నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు పూర్తిగా ఆటపాటలు, భావ వ్యక్తీకరణ, శారీరక కదలికలకు, మెదడు అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఉంటాయి. వాటిని నిరంతరం పరిశీలిస్తూ పిల్లలు ఆనందంగా ఉండే విధంగా అంగన్‌వాడీ టీచర్ల ప్రణాళిక ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరు అమ్మ పాత్ర పోషిస్తారు. చిన్నారులను ఒక క్రమపద్ధతిలో పెట్టే ప్రణాళిక ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉండటం మొదటి దశ. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను ప్రత్యేక సిలబస్, కాల నిర్ణయ పట్టిక ప్రకారం చదువు చెప్పటం రెండో దశ. ఎన్‌సిఇఆర్‌టి, ఎస్‌సిఆర్‌టి లు వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యా హక్కు చట్టంలో కొనసాగుతున్న పద్ధతే సరైనదని పేర్కొన్నాయి.
ప్రీ ప్రైమరీ కేంద్రాలు
విద్యను కార్పొరేట్లకు, ప్రైవేటు సంస్థలకు అనుగుణంగా నూతన విద్యా విధానం మారుస్తోంది. ప్లే స్కూళ్లు, ఎల్‌కెజి, యుకెజి వంటి రకరకాల పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షించి చిరు బాల్యాన్ని ఏరకంగా వ్యాపారం చేసుకుంటున్నారో చూస్తున్నాం. పిల్లలు మస్తిష్క భారంతో ఇంటికి ఎలా వస్తున్నారో చూస్తున్నాం. స్వేచ్ఛగా పరిశీలించడానికి, కనీసం ఏడవడానికి, నవ్వడానికి అవకాశం లేని విద్యా విధానం చిన్నారుల పాలిట శాపంగా మారనుంది. ఆ వయసు పిల్లలకు 2,3 తరగతుల బోధన చేసినట్లు... లెక్కలు, సైన్సు ఆంగ్లం చదువులే చెప్పాలి. ఇలాంటి భారాలు ఆ వయసు పిల్లలను సరిగ్గా ఎదగనివ్వవు. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం ఒక అంశం అయితే...బాల్యాన్ని భారంగా మార్చడం రెండవ అంశం. దాంతో ప్రీ ప్రైమరీలో 1,2 తరగతుల పిల్లలు డ్రాపవుట్ అయ్యే ప్రమాదం ఉంది.
సమగ్ర శిశుసంరక్షణ?
అంగన్‌వాడీ కేంద్రాలలోని పిల్లల బాధ్యత నుంచి తప్పుకోవడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం ఉంది. పిల్లల బాధ్యత నుండి తప్పుకోవడమంటే 'సమగ్ర శిశు సంరక్షణ మాది కాదు' అని చెప్పటమే. పూర్వ ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు నమోదు అవుతున్నారా? లేదా? అనేది ప్రశ్న. విద్య ఒక్కటే కాదు. శిశువుల ఆరోగ్యం, టీకాలు, పోషకాహారం అందివ్వడం వంటివన్నీ ఐసిడిఎస్ లో భాగంగా ప్రభుత్వమే అందిస్తున్నది. దేశంలో ఇప్పటికే 9 లక్షల మంది పిల్లలు మరణించారు. ఈ ఏడాది మరో 3 లక్షల మంది మరణిస్తారని యునిసెఫ్ హెచ్చరించింది. ముందు పిల్లలు పుష్టిగా ఉంటేనే చదువుకోగలుగుతారు. పిల్లలను పుష్టిగా తయారు చేసే ఐసిడిఎస్ ను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. అందువల్లనే నానాటికీ బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. 1500 కోట్ల మందికి 1800 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఇది రెట్టింపు చేస్తేనే ఐసిడిఎస్ బలోపేతం అవుతుంది. ఇప్పటికే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. నగదు బదిలీ చేస్తున్నారు, అది లబ్ధిదారులకు ఎంతవరకు చేరుతుందో అనుభవమే. నలభై సంవత్సరాలుగా ఉద్యోగుల కృషి, పోరాటాల కారణంగా ఐసిడిఎస్ ను రక్షించుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంతటి కీలకమైన వ్యవస్థను సైతం నిర్వీర్యం చేసే పనిలో పడింది.
ఎంతటి అశాస్త్రీయత!
అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయటం లేదు సరికదా...ఇంగ్లీష్ మీడియం పేరుతో ఇప్పటికే కొన్ని సెంటర్లను విలీనం చేశారు. ఇప్పుడు 1,2 తరగతులను విలీనం చేసి చదువు చెబుతామంటున్నారు. ఎవరు ఎవరికి చదువు చెప్తారో అర్థం కాని ప్రశ్న. ప్రాథమిక తరగతుల టీచర్ల ప్యాట్రన్, సర్వీస్ అంశాలు, శిక్షణ, బోధన అంతా ఒక వ్యవస్థ. అంగన్‌వాడీ ఉద్యోగుల సర్వీసులు, విద్యార్హతలు, పని ప్రణాళిక ఇదొక వ్యవస్థ. ఈ రెండింటినీ విలీనం చేయటం పొసగని పని.
అంగన్‌వాడీ కేంద్రాలను ఇప్పటికే అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ప్రీ ప్రైమరీ సెంటర్లను ప్రైమరీ పాఠశాల పరిసరాలలోనే భవనాలను నిర్మించి అటాచ్ చేయమన్న డిమాండ్ వుంది. ఎన్‌సిఇఆర్‌టి 992 లోనే ప్రీ ప్రైమరీ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. తరువాత విద్యా హక్కు చట్టం ప్రీ ప్రైమరీ విద్యకు తగు ఏర్పాట్లు చేయాలని సెక్షన్ 11 చెప్పింది. చిన్న పిల్లల సంరక్షణ వ్యవస్థగా ప్రోబెల్ రూపొందించిన విధానం ప్రపంచ దేశాలలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటన్నిటినీ విస్మరించి మూడో ఏట నుంచే చదువులంటే ముందు తరాల చిన్నారులను విద్యకు దూరం చేయడమే. పిల్లల సృజనాత్మకతను నాశనం చేసే ప్రమాదం కూడా ఈ నూతన విద్యా విధానంలో ఉంది.
అంగన్‌వాడీ వ్యవస్థపై దుష్ప్రభావం
కేంద్ర ప్రభుత్వం కరోనా సమయం లోనే బలమైన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్భయంగా కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. ఐసిడిఎస్ వ్యవస్థ దీనికి మినహాయింపు కాదు. అందులో భాగంగానే అంగన్‌వాడీలనూ విడిచి పెట్టలేదు. ముందు ఎన్‌ఇపి ద్వారా 1, 2 తరగతులను అంగన్‌వాడీ సెంటర్లలో విలీనం చేయడం. ఆ తర్వాత...చదువు, మూల్యాంకనం, మార్కులు, గ్రేడింగులు...ఆ పైన సెంటర్లకు-ఉద్యోగులకు గ్రేడింగులు పెట్టి అనేక షరతులతో వారికి ఉద్వాసన పలికే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 'వేదాంత'కు నాలుగు వేల సెంటర్లను అప్పగించారు. ఇస్కాన్, అక్షయ పాత్ర లకు అప్పగించే పనిలో వున్నారు. 40 ఏళ్లు పని చేసినా పెన్షన్ లేకుండానే రిటైర్ అవుతున్నారు. వారికి గతంలో ఇచ్చిన హామీలు (ఇళ్ల స్థలాలు, వేతనాలు, బడ్జెట్ పెంపు, భద్రతా పరికరాలు, పి.ఎఫ్, ఇఎస్‌ఐ, గ్రాట్యుటీ) ఏవీ అమలు కావడం లేదు. ఇది చాలదన్నట్లు 'నూతన విద్యా విధానం-2020' అమలుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మన ముఖ్యమంత్రి గారు మరొక అడుగు ముందుకేసి అంగన్‌వాడీ సెంటర్లలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ చెవిలో ఎబిసిడి అని చెప్పండి అన్న చందంగా ఉంది.- కె.విజయగౌరి
ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా వచ్చే ప్రమాదాల పట్ల విద్యా రంగ మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్‌వాడీ ఉద్యోగులు...అందరూ చైతన్యంతో ప్రతిఘటించకపోతే ఈ వ్యవస్థను రక్షించుకోవడం కష్టం. అంగన్‌వాడీ టీచర్లకు పోరాటాలు కొత్తేమీ కాదు. చారిత్రాత్మక ఘటనలను స్మరించుకుంటూ పోరాటాల ద్వారా నూతన విద్యా విధానాన్ని తిప్పికొట్టాలి.
(వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు)










