Jan 10,2023 21:30

ఫొటో : ఆర్‌డిఒ కరుణకుమారికి వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలకు రూ.26వేలు వేతనమివ్వాలి
ప్రజాశక్తి. - ఆత్మకూరు అర్బన్‌ : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆత్మకూరు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు ఆర్‌డిఒ కరుణకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు సెంటర్‌ పరిధిలోని పేద, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకి అనేక సేవలందిస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవని, కొన్ని కేంద్రాల్లో అసలు విద్యుత్‌ సౌకర్యం లేదని, విద్యుత్‌ సౌకర్యమున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. టిఎ, డిఎలు గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రభుత్వం చెల్లించడం లేదని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అమలకు కొన్ని ప్రాజెక్టుల్లో గత ఆరు నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదని, దీనివల్ల అంగన్‌వాడీలు అప్పులు చేసి, లబ్ధిదారులకు ఆహారం వండి పెడుతున్నారని తెలియజేశారు. రకరకాల యాప్‌లు తీసుకొని వచ్చి, పని భారం పెంచారు కానీ వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన ఫోన్‌లు పనిచేయడం లేదని, గ్రామాల్లో నెట్‌ సౌకర్యం ఉండటం లేదని, ఫేస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషక పథకాన్ని అమలు చేస్తున్న మెనూకు తగిన విధంగా మెనూ ఛార్జీలు సరుకులు క్వాంటిటీ పెంచలేదని తెలిపారు. ఇప్పటికీ పౌష్టికాహారంలో ఇచ్చే మెనూ నిమిత్తం ఒక్కొక్క పిల్ల వాడికి కేవలం ఐదు గ్రాములు నూనె 15 గ్రాములు నాసిరకం కందిపప్పు ఇస్తున్నారన్నారు. కొన్ని ప్రాజెక్టులలో గత రెండు నెలల నుండి ఆయిల్‌, పప్పు ఇవ్వలేదని, గ్యాస్‌ ధరలు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. అంగన్‌వాడీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉద్యోగ భద్రత లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సూపర్వైజర్‌ పోస్టుల్లో వయోపరిమితి తొలగించాలని, తదితర అంగన్‌వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొండమూరి హజరత్తయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ కార్యదర్శి పి.రాధ, మాజీ కార్యదర్శి సుజాత, సెక్టార్‌ లీడర్లు సుప్రజ, దొరసానమ్మ, రుతమ్మ, విజయమ్మ, పుష్పకళ, మస్తానమ్మ, పద్మావతి, శ్రీదేవి, గుల్జార్‌బేగం, రమణమ్మ, లక్ష్మి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.