Jan 25,2023 21:30

ఫొటో : ధర్నా చేపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అంగన్‌వాడీలకు కనీస వేతనం, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహారం క్వాంటిటీ పెంచాలని వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు సెంటర్లు పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. సిఐటియు మండల కార్యదర్శి కొండమూరి హజరత్తయ్య, అంగన్‌వాడీల ప్రాజెక్టు కార్యదర్శి పి.రాధమ్మ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు సెంటర్‌ పరిధిలోని పేద, గర్భిణీలు, బాలింతలు చిన్నపిల్లలకి అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లో మౌలిక వసతులు లేవని, కొన్ని కేంద్రాలలో అసలు విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు.
విద్యుత్‌ సౌకర్యం ఉన్న ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, టిఎ, డిఎలు, గత ఐదు సంవత్సరాలు కాలంగా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అమలకు కొన్ని ప్రాజెక్టుల్లో గత ఆరు నెలల నుండి బిల్లులు చెల్లించలేదని, దీనివల్ల అంగన్‌వాడీలు అప్పులు చేసి లబ్ధిదారులకు ఆహారం వండి పెడుతున్నారని తెలిపారు. రకరకాల యాప్‌లు తీసుకువచ్చి పని ప్రారంభించారు కానీ వేతనాలు పెంచలేదన్నారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని గ్రామాల్లో నెట్‌ సౌకర్యం ఉండటం లేదని, ఫేస్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ఇది అమలు చేయడం సాధ్యం కాని పని అని తెలియజేశారు. అంగన్‌వాడీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సచివాలయాల పర్యవేక్షణలో చేయాలని నిర్ణయించారని తెలిపారు. ఈ పాటికే ఐసిడిఎస్‌ అధికారులు పీడీ, సిడిపిఒ, సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారన్నారు. సెంటర్లను బలోపేతం చేయడానికి నిధులు పెంచి అంగన్‌వాడీలకు ప్రత్యేక భద్రత కల్పించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల పర్యవేక్షణ చేయాలన్నారు. ఫుడ్‌ కమిషన్‌ ఎం.ఎస్‌.కె, తహశీల్దారు, ఎంపిడిఒ రాజకీయ నాయకులు ఇలా అనేకమంది విజిట్ల పేరుతో అంగన్‌వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు కె.రమణమ్మ, కె.సుజాత, సుప్రజ, విజయమ్మ, మస్తానమ్మ, పద్మావతి, విజయలక్ష్మి, విజయమ్మ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.