Jul 04,2023 22:39

పోస్టర్లు విడుదల చేస్తున్న అంగన్వాడీలు

ఓబుల దేవర చెరువు : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి రమణ డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈనెల10 అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలన్నారు. ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని కోరారు. అంగన్వాడీ విద్యను బలోపేతం చెయ్యాలని డిమాండ్‌ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ లీడర్లు, వై రంగమ్మ, కమలమ్మ ,వరలక్ష్మి, మణిమాల, ఆదిలక్ష్మి, మేరీ సుజాత, విమలమ్మ, షమీం, పద్మావతి, లక్ష్మీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : అంగన్వాడీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కోరారు. మంగళవారం కదిరి పట్టణంలోని రాయచోటి రోడ్డు లోని అంగన్వాడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మాబున్నిసా, లక్ష్మి, పద్మావతి, శారద, మాధవి సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, ముస్థక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందజేస్తున్న ఐసిడిఎస్‌ను, అంగన్వాడీలను పరిరక్షించాలని కోరారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10, 11 తేదీలలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసనను జయప్రదం చేయాలని కోరారు.