ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, ఫేషియల్ యాప్‌ను రద్దు చేయాలని మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు నాగబసిరెడ్డి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఆరేళ్ల టిఎ బిల్లులుకు సంబంధించి బడ్జెట్ విడుదల చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యూటీ పెన్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలిపారు. ఆన్‌లైన్ పనిభారం తగ్గించి సెంటర్‌కు నేరుగా రేషన్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సిడిపిఒ శశికళకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షులు సిద్ధమ్మ, అంగన్వాడీ జిల్లా నాయకులు బంగారు పాప, ఖాజాబీ, భాగ్యలక్ష్మి, విజయ, నాగమణి, ప్రవీణ, సుమలత, భూదేవి, శంకరమ్మ, కవిత, పద్మజ, జయలక్ష్మి, దేవి, శైలజ, రమణమ్మ, మేరీ, సిద్ధమ్మ, రెడ్డమ్మ, ఉషా రాణి పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్: స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.హరేంద్రనాథ్ శర్మ, డి.ప్రభాకర్‌రెడ్డి అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. జిఒ నెంబర్ 15ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డిఆర్.మధురవాణి, రాజేశ్వరి, గౌరి పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లె : అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ నిత్యం అంగన్వాడీ సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలందించే వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జె.సుకుమారి, కార్యదర్శి ఓబులమ్మ, నాయకులు ప్రభావతి, సెక్టార్ల లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తంబళ్లపల్లి :స్థానిక ప్రాజెక్టు పరిధిలోనే అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారానికై ఐసిడిఎస్ నాగవేణికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్లు పాల్గొన్నారు.










