Jun 27,2023 22:19

సమావేశంలో పాల్గొన్న నాయకులు, అంగన్వాడీలు

సోమందేపల్లి : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జూలై 10,11 తేదీల్లో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కోరారు. మండల కేంద్రంలోని అంబా భవాని ఫంక్షన్‌ హాల్‌లో అంగన్వాడీల జిల్లా వర్క్‌ షాప్‌ ఉషారాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారావు మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ పెంచాలని, అంగన్‌ వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐసిడిఎస్‌ పరిరక్షణ కోసం, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటి అమలు చెయ్యాలని, ఇతర పెండింగ్‌ సమస్యలు పరిష్కారం చెయ్యాలని అన్నారు. కోర్కెల దినం సందర్భంగా దేశ వ్యాపితంగా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 10 11న కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాలలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ఐసిడిఎస్‌ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించక పోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, ప్రాజెక్టు కార్యదర్శులు చంద్రకళ, లక్ష్మీదేవి, లావణ్య, సుశీల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : అంగన్‌ వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దశల వారీ ఉద్యమాలకు సిద్దం కావాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప పిలుపు నిచ్చారు. అంగన్‌ వాడి కార్యకర్తల సమస్యలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నరసింహప్ప మాట్లాడుతు అంగన్‌ వాడీ కార్యకర్తల సమస్యలపై జూలై 10, 11 వతేదీలలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.