Sep 25,2023 19:49

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
అంగన్వాడీల నిర్బంధం దుర్మార్గ
ప్రజాశక్తి-నెల్లూరు:అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో నిర్వహించతలపెట్టి ధర్నాను వైసిపి ప్రభుత్వం విఫలం చేసేందుకు పోలీసు నిర్బంధాన్ని, అరెస్టులను ప్రయోగించడం దుర్మార్గమైన చర్యలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసేందుకు వెళ్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం పోలీసు సహాయంతో నిర్బంధాన్ని విధించడం అప్రజాస్వామికమన్నారు. శాంతియుతంగా ధర్నాకు ప్రయత్నిస్తుంటే హింస జరుగుతుందని పోలీసులే తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.
ధర్నాలో పాల్గొనేందుకు రైలు, రోడ్డు మార్గంలో వెళ్ళిన అంగన్‌వాడీలను విజయవాడ శివారు ప్రాంతంలోనే పోలీసులు అడ్డుకోని అక్రమంగా నిర్భందించడం అన్యాయమన్నారు. అంతే కాకుండా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ను అనుసరించి సెక్షన్‌ 143, 290,188, ఆర్‌ డబ్ల్యూ 149, సెక్షన్‌ 39, తదితర సెక్షన్ల క్రింద పోలీసు కేసులు నమోదు చేయడం హేయమన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ ఇళ్ల వద్దే అంగన్వాడీ నాయకులను, కార్యకర్తలను, ట్రేడ్‌ యూనియన్ల నాయకులను గహ నిర్బంధం చేయడం, నోటీసులు జారీ చేయడం, వారి వాహనాలను అడ్డుకోవడం, బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. ధర్నాకు అనుమతివ్వకపోవడం నిరంకుశమని, అప్రజాస్వామికమని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్ఫర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కొంతకాలంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారని, కలెక్టరేట్ల వద్ద వేలాది మందితో ధర్నాలు, ప్రదర్శనలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించక పోవడం అన్యాయమని విమర్శించారు. జిల్లాలో గహ నిర్బంధాలు, నోటీసులు, అడ్డుకోవడాలు, అరెస్టులు ఆపాలని కోరారు. జిల్లాల్లో అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, తుళ్లూరు గోపాల్‌, గోగుల శ్రీనివాసులు, గుంజి దయాకర్‌, ముత్యాల గుర్నాదం, సిఐటియు నాయకులు కె.అజరుకుమార్‌, రైతు సంఘం నాయకులు మూలివెంగయ్య తదితరులు పాల్గొన్నారు.