నిరసన తెలుపుతున్న నాయకులు
అంగన్‌వాడీల అక్రమ అరెస్టులు దారుణం
నెల్లూరు :అంగన్‌వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నేడు నిర్వహించ తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్తున్న వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేయడం దారుణమని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ యూనియన్ జిల్లా కమిటీ పేర్కొంది. సోమవారం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో ఆ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ప్రభుత్వం చేపట్టిన అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నగర కార్యదర్శి జి . నాగేశ్వర రావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న సిఎం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్ళి పరిష్కరించుకోవాలని ఆలోచన చేసి శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని భగం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. అంగన్‌వాడీలకు పోలీసులు ఫోన్ చేసి ఎక్కడ ఉండేది అడ్రస్సు చెప్పాలని, తాము ఇచ్చే నోటీసులు తీసుకోని ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరు కోబోమని, హాజరైతే పోలీసు చర్యలు తీసుకోవచ్చు అని అంటూ రాసి సంతకం చేసి అందజేయాలని బెదిరించడం దారుణమన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బస్సులో ప్రయాణిస్తున్న వారిని మార్గ మద్యలోనే బస్సులు నిలిపి తనిఖీలు చేసి గుర్తించి అరెస్టులు చేయడం, రైల్లో పోయేటటువంటి వాళ్ళని మధ్యలో ఆపేసి అరెస్టులు చేయడం, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకొని రైల్వే స్టేషన్ లోనే నిర్బంధించడం పిరికిపంద చర్యలన్నారు. రాష్ట్రాధికారం చేజిక్కించుకొనేందుకు అంగన్వాడీలకు ఆర్భాటంగా అనేక హామీలు చేశారని, వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తెలంగాణలో2021నుంచి అంగన్‌వాడీలకు రూ.13,650లు వేతనంగా అందజేస్తుంటే వైసిపి ప్రభుత్వం రూ. 11,500 లు అందజేయడం ఎంత వరకు న్యాయమన్నారు. అంగన్‌వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 ఐదు లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. జీవితంలో సగంభాగం పెన్షన్ ఇవ్వాలని, దేశి యాప్ రద్దు చేయాలని పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంపుదల చేయాలన్నారు. గ్యాస్ ను ప్రభుత్వ సెంటర్లకు సరఫరా చేయాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఏ బిల్లులను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేందుకు ఆయలు కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసిన వారందరిని బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్, ఐద్వా నగర కార్యదర్శి కె. పద్మ డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బిపి నరసింహ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, మైదిలి, శైలజ మల్లెమ్మ, కళ్యాణి, మాధవి ఐద్వా నాయకులు కుమారమ్మ, రెహను మా, డివైఎఫ్‌ఐ నాయకులు కర్తం బాబు తదితరులు పాల్గొన్నారు.










