అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ప్రజాశక్తి-కావలి : పట్టణ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె రెహనా బేగం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆందోళనలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఆందోళన చేస్తున్నామని తెలియజేశారు. అంగన్‌వాడీలు పేద గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు నిత్యం అనేక సేవలు అందిస్తున్నారని కొన్ని అంగన్‌వాడీ సెంటర్లకు ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేదన్నారు. సౌకర్యం ఉన్న సెంటర్లకు విద్యుత్, బిల్లులు 8సంవత్సరాల నుంచి చెల్లించలేదన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు అప్పులు చేసి లబ్ధిదారులకు ఆహారం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని, గ్రామాలలో నెట్ సౌకర్యం లేనందున ప్రభుత్వం మాత్రం ముఖ హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని ఒత్తిడి తెస్తుందని తెలిపారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా రకరకాల యాపుల ద్వారా పనిచేయించడం జరుగుతుందన్నారు. పనిచేయని ఫోన్లతో నెట్ బ్యాలెన్స్ లేక యాప్‌లు డౌన్లోడ్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఫిబ్రవరి 6వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనకు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పనికి తగిన వేతనాలు ఇవ్వకుండా వారిపై విపరీతమైన పనిభారం పెంచుతుందని విమర్శించారు. పనికి తగిన వేతనాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనెఫిట్స్ రూ.5లక్షలు ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ అయిన వారికి వారి జీతంలో సగం పెన్షన్‌గా ఇవ్వాలని, చనిపోయిన వర్కర్ల కుటుంబాలకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. పెండింగ్ జీతాలు బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో విజయలత, సుకన్య, సుభాషిని, రఘురావమ్మా, టి.అరుణ, బిందు, పెంచలమ్మ, రజిత, ఆయిషా, మల్లికా జ్యోతి, ఆర్.పద్మావతి, కళావతి, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.










