నినాదాలు చేస్తున్న దృశ్యం
అంగన్‌వాడీ మహిళల అక్రమ అరెస్టులు హేయం
-అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఆర్భాటంగా చేసిన హామీలను అమలు చేయాలని కోరుతూ, చివరకు ప్రస్తుతం జరగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అయినా చర్చలు నిర్వహించి కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యూటీ అందజేయాలని కోరుతూ విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను ప్రభుత్వం భగం చేయడం, అంగన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కమిటీ పేర్కొంది. మంగళవారం విజయవాడలో అంగన్‌వాడీలపై పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలు, అక్రమ అరెస్టులు, గృహనిర్భందాలను వ్యతిరేకిస్తూ నగరంలోని గాంధీబొమ్మ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె రెహనాబేగం మాట్లాడుతూ పోలీసులు అంగన్‌వాడీల పట్ల వ్యవహరించిన తీరు దారుణమని, తమ న్యాయమైన సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్యపద్దతిలో శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు వెళ్తున్న అంగన్‌వాడీలను అరెస్టు చేయడం, గృహ నిర్భందం చేయడం సిగ్గు చేటన్నారు. ఈ చర్యలను అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్ మాట్లాడుతూ పోలీసు నిర్భందాలను అధిగమించి జిల్లా నుంచి 500 మందికి పైగా అంగన్‌వాడీలు విజయవాడకు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడి అంగన్‌వాడీ మహిళలను అడ్డుకోలేరన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ం స్పందించి అంగన్‌వాడీలకు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాని పక్షంలో మహిళల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు పద్మమ్మ, సంపూర్ణమ్మ, కామాక్షి, మలెమ్మ, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.










