Dec 22,2022 22:47

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీల పోస్టుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ ఐసిడిఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో అంగనవాడీ కార్యకర్తలు సహాయకుల భర్తీ విషయంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ కార్తిక్‌, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మి కుమారి, ఆర్డీవోలు భాగ్య రేఖ, తిప్పే నాయక్‌, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను సంక్రాంతి లోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వ నిబంధనలు మేరకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు ఖాళీల భర్తీ పక్రియ వేగవంతం చేయాలని అందుకు జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జాబితా పూర్తయిన వెంటనే జిల్లా సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆమోదించిన వెంటనే ప్రకటన విడుదల చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ఏడు క్లస్టర్లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో పరిశీలించి జాబితాను వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడు క్లస్టర్ల సిడిపిఒలు నాగమల్లేశ్వర్‌ రెడ్డి, రమణమ్మ, శాంత లక్ష్మి, రాధిక, లక్ష్మీ, మహాలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.