Apr 08,2022 22:05
  • అందులో మత ప్రసక్తి లేదు
  • బిజెపి వైఖరి జాతీయ సమైక్యతకు నష్టం
  • పోరాటాలకు సిద్ధమవుతున్నారు
  • మా బాధను పంచుకోవడానికి బదులు మార్కెట్‌ చేసుకుంటున్నారు

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : జమ్మూ కాశ్మీర్‌ పట్ల కేంద్రంలోని బిజెపి వైఖరితో జాతీయ సమైక్యతకు తీవ్ర నష్టం జరుగుతుందని సిపిఎం సీనియర్‌ నేత మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి విమర్శించారు. ప్రజలు భ్రమలను వీడి, పోరాటాలకు సిద్ధమవుతున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ నుంచి హాజరైన మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి ప్రజాశక్తి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లో అందరం బాధితులమేనని, అందులో మత ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తమ బాధను పంచుకోవడానికి బదులు, కొందరు దాన్ని మార్కెట్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. సంభాషణ ఇలా సాగింది :

  • ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 (ఎ) రద్దు, రాష్ట్ర విభజన తరువాత జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

రాజ్యాంగ ఉల్లంఘనతో రాష్ట్ర విభజన జరిగింది. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 (ఎ) రద్దుతో మా రాజ్యాంగ హక్కులు కాలరాయబడ్డాయి. దీంతో జమ్మూ కాశ్మీర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలపై ప్రభావం పడింది. రాష్ట్ర విభజన చేసి, రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ అనడం దారుణం. ఎక్కడైనా కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హౌదా ఇస్తారు. ఇక్కడ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ చర్యతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేంద్రంలోని బిజెపి పెద్దలు ప్రచారం చేశారు. వాస్తవానికి వారు జమ్మూకాశ్మీర్‌ను చిన్నాభిన్నం చేశారే తప్ప, ఎటువంటి నిర్మాణాత్మక చర్యలూ చేపట్టలేదు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, బెదిరింపులు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి. దాదాపు ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న జమ్మూకాశ్మీర్‌ను, 200 ఏళ్ల చరిత్ర ఉన్న లడఖ్‌, జమ్మూ కాశ్మీర్‌ను ఒక ఆదేశంతో చెరిపేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఎక్కడా ప్రజలతో, రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చలూ చేపట్టలేదు. పార్లమెంట్‌లోనూ చర్చ చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా విభజనకు గురవ్వలేదు. ఇక్కడ మా పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించారు. కాశ్మీర్‌ ప్రజలు భారతదేశంలో అంతర్భాగం కావాలని నిలబడినందుకు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఉగ్రవాదానికి బలయ్యారు. కానీ, బిజెపి మాపై నిందా ప్రచారం చేస్తోంది. ఇప్పుడిప్పుడే దేశ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. నాడు విభజనను స్వాగతించిన లఢఖ్‌ ప్రజల్లో కొంత మంది, బిజెపి నాటకాన్ని తెలుసుకున్నారు. తమ గుర్తింపు రద్దుకు, తమ సంస్క ృతిపై దాడికీ జరిగిన కుట్రగా అందరూ అర్థం చేసుకున్నారు. రాష్ట్ర విభజన, ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 (ఎ) రద్దులో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని సుప్రీం కోర్టులో సిపిఎంతోపాటు మరికొన్ని పార్టీలు పిటిషన్‌ దాఖలు చేశాయి. అవి విచారణ దశలో ఉన్నాయి.

  • అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మీ వైఖరేంటి?

రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి, దాదాపు నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పేరిట సాగదీత మొదలు పెట్టారు. అందులో కూడా మతం కార్డు ఉపయోగిస్తున్నారు. హిందూ, ముస్లిం విభజన తీసుకొస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. అలానే చేయాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు అందుబాట్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. పోనీ 2021 జనాభా లెక్కల ప్రకారమైనా చేయాలి. కానీ, ఇప్పటివరకు జనగణన చేపట్టలేదు. కానీ, నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకుంటుంది. ఒక వర్గం పట్ల తీవ్రమైన వివక్ష ప్రదర్శిస్తుంది. జమ్మూకి ఆరు, శ్రీనగర్‌కు రెండు స్థానాలు కేటాయించడమంటే, మత ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేయడమే అవుతుంది. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. న్యాయ పోరాటం చేస్తున్నాం.

  • కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను బిజెపి ప్రచారం చేస్తుంది కదా! ఆ సినిమా వాస్తవాలకు దగ్గరగా ఉందా?

దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పక్కదోవ పట్టించడంలోని భాగంగా ఈ సినిమా వచ్చింది. అందులో ఎటువంటి క్షేత్రస్థాయి పరిశీలన, పరిశోధన లేవు. కాశ్మీర్‌ పండిట్లకు జరిగిన దాన్ని అందరం ఖండించాం. కానీ, కాశ్మీర్‌లో అన్ని మతాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అనేక కోణాల నుంచి మేమంతా బాధితులమే! మతాల ప్రసక్తి లేదు. దేశం కోసం కుటుంబ సభ్యులను కోల్పోయాం. వందలాది మంది పార్టీ కార్యకర్తలను కోల్పోయాం. ఆ అంశాలను ఈ సినిమా పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్న ఈ ఎనిమిదేళ్లలో కాశ్మీర్‌ పండిట్లకు ఏం చేశారు? జమ్మూకాశ్మీర్‌లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు, బౌద్ధులు అందరూ కలిసిమెలసి ఉంటారు. అన్ని మతాలూ కాశ్మీరీయత్‌ సంస్క ృతితో జీవనం సాగిస్తున్నాయి. కాశ్మీర్‌ ఫైల్స్‌ ఆ అంశాలను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. మా బాధను వారు మార్కెట్‌ చేసుకోవడం దారుణం.
కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు చాలా చేస్తుందని బిజెపి నేతలు చెబుతున్నారు...
రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటినే వారు ఇవ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వం మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండదు. అది జమ్మూ కాశ్మీర్‌కే వర్తించదు. దేశం మొత్తం ఒకటే తీరు. వారు చెప్పేవన్నీ అబాద్ధాలే!

  • ప్రజా సమస్యలపై కదలిక ఎలా ఉంది?

రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగ కల్పన గురించి కేంద్ర పెద్దలు మాట్లాడారు. కానీ ఇప్పటివరకూ ఎటువంటి ఉద్యోగ భర్తీ జరగలేదు. పేదరికం, నిరుద్యోగం, భూ హక్కు, ఉద్యోగ హక్కు వంటి సమస్యలపై ప్రజలు ముందుకు వస్తున్నారు. లఢఖ్‌లో బుద్ధిస్ట్‌ సంఘాలు, రాజకీయ పార్టీలు ఐక్యంగా రెండుసార్లు ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. ప్రజలు రాష్ట్ర హౌదా కోసం డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష రాజకీయ నేతలపై ఈడి, సిబిఐ, ఎన్‌ఐఎలతో పాటు ఇతర రూపాల్లో కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తోంది. వేధిస్తోంది. నకిలీ కేసులు బనాయించి, బెదిరింపులకు పాల్పడుతోంది.