Aug 18,2021 06:19

  • సెప్టెంబర్‌ 15 నుండి ఆందోళనకు సిపిఐ(యం) పిలుపు

   రేంద్రమోడీ ప్రభుత్వం రెండవసారి ఏర్పడ్డాక కార్పొరేట్‌ శక్తుల్ని పెంచడమే లక్ష్యంగా సరళీకరణ విధానాల అమలును వేగవంతం చేసింది. మరోవైపు మత విభజనను పెంచే చర్యలు వేగవంతం చేసింది. రెండవ విడత కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైఫల్యం చెంది తమ సొంత మధ్యతరగతి మద్దతుదారుల్లో సైతం నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణలో విఫలమైన తీరు గంగానదీ ప్రవాహంలో శవాల రూపంలో బహిర్గతం అయింది. ఏడు మాసాల్లో ఎన్నికలు ఎదుర్కోవలసిన ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి ప్రభుత్వం మతోన్మాద చర్యలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి పూనుకుంటోంది.. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం అంశాలతోపాటు హిందూత్వను, సరళీకరణ, ప్రయివేటీకరణను ఎదిరిస్తూ సెప్టెంబర్‌ మాసంలో ఆందోళనకు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
      భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆగష్టు 6,7,8 తేదీల్లో జరిగాయి. దేశ రాజకీయ పరిణామాలను కమిటీ విశ్లేషించింది. నరేంద్రమోడీ ప్రభుత్వం రెండవసారి ఏర్పడ్డాక దూకుడు పెంచింది. కార్పొరేట్‌ శక్తుల్ని పెంచడమే లక్ష్యంగా సరళీకరణ విధానాల అమలును వేగవంతం చేసింది. మరోవైపు మత విభజనను పెంచే చర్యలు వేగవంతం చేసింది. అయితే ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎదురుదెబ్బ తిన్నది. బెంగాల్‌, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే, ఒక్క అస్సాం లోనే కొద్దిపాటి మార్జిన్‌తో అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌, కర్నాటక రాష్ట్రాల్లో బిజెపి పాలనలో ఆంతరంగిక సమస్యలను ఎదుర్కొన్నది. ఫలితంగా ముఖ్య మంత్రుల్ని మార్చింది. రెండవ విడత కరోనా మహమ్మారిని అరికట్టడంలో వైఫల్యం చెంది తమ సొంత మధ్యతరగతి మద్దతుదారుల్లో సైతం నిరసనను ఎదుర్కొనవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణలో విఫలమైన తీరు గంగానదీ ప్రవాహంలో శవాల రూపంలో బహిర్గతం అయింది. ఏడు మాసాల్లో ఎన్నికలు ఎదుర్కోవలసిన ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి ప్రభుత్వం మతోన్మాద చర్యలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి పూనుకుంటోంది. జనాభా విధానం, లవ్‌ జీహాద్‌ చట్టం తదితరాల ద్వారా మత విభజన రెచ్చగొట్టే చర్యలు చేపట్టింది. అయితే ఈ కాలంలో రైతాంగ ఉద్యమాలు, కార్మికుల పోరాటాలు బలోపేతం అయ్యాయి. బిజెపి కి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రతిపక్షాల మధ్య సఖ్యత మరింత బలపడింది. వైఎస్సార్‌సిపి, టిడిపి దీనికి దూరంగా వున్నాయి. మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపి కి వీరెందుకు వంత పాడుతున్నారో ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాల ప్రాధాన్యత పెరిగింది. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం అంశాలతోపాటు హిందూత్వను, సరళీకరణ, ప్రయివేటీకరణను ఎదిరిస్తూ సెప్టెంబర్‌ మాసంలో ఆందోళనకు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్‌ 15 నుంచి ప్రారంభించి పదిహేను రోజులపాటు రాష్ట్రం లోని అన్ని శాఖలు ప్రభుత్వ కార్యాలయాల ముందు సభలు, సమావేశాలు జరిపి ఆందోళన చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

(1) అందరికీ ఉచిత టీకా ఇవ్వడానికి వీలుగా వ్యాక్సినేషన్‌ వనరులన్నింటిని దేశీయంగానూ, విదేశాల నుండి సేకరించి తక్షణం అందించాలి. కోవిడ్‌తో మరణించినవారికి సముచితమైన నష్టపరిహారం అందించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య వ్యవస్థను విస్తృతపరచాలి.
(2) ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 అందించాలి.
(3) కేరళలో మాదిరిగా అవసరమైన అందరికీ నిత్యావసర వస్తువులతో రోజువారీ భత్యం అందించాలి.
(4) అధిక ధరలను అదుపు చేయడానికి పెట్రోలు ఉత్పత్తుల మీద కేంద్రం విధించిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలి.
(5) రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. రైతు ఖర్చులో 50 శాతం మిగులు ఉండేలా గిట్టుబాటు ధరలు అందించడానికి వీలుగా చట్టం తేవాలి.
(6) ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణ ఆపాలి. ఇప్పటికే చేసిన వాటిని ప్రభుత్వ రంగంలోకి పునరుద్ధరించాలి.
(7) లేబర్‌ కోడ్‌ చట్ట సవరణలు రద్దు చేయాలి. సమ్మె హక్కు, వేతనాల సంప్రదింపుల హక్కు లాంటి కార్మిక హక్కుల్ని పునరుద్ధరించాలి.
(8) యం.ఎస్‌.ఎన్‌.ఇ.ల మనుగడకు అప్పులిచ్చే దాని స్థానంలో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి.
(9) గ్రామీణ ఉపాధిహామీ పథకం 200 రోజులకు విస్తరింపజేయాలి. వేతనాలు రెట్టింపు చేయాలి.
(10) గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేయాలి.
(11) ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచి ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు కలిగించాలి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులు నింపాలి.
(12) వ్యాక్సినేషన్‌ అందించడంలో విద్యా రంగంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే విద్యా సంస్థలు ప్రారంభించాలి.
(13) పెగాసస్‌ స్పైవేర్‌ వినియోగంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జుడిషియల్‌ ఎంక్వయిరీ కమిటీ నియమించి వెంటనే వాస్తవాలు వెలుగులోకి తేవాలి.
(14) రాఫెల్‌ ఒప్పందాలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త ఒప్పందాన్ని నివారించాలి.
(15) ఉపా చట్టం కింద, బీమా కోరెగావ్‌ కేసులోనూ, సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లోనూ అరెస్టు చేయబడిన రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి. దేశద్రోహ చట్టాలు, ఎన్‌ఎస్‌ఏ లాంటి సంస్థల్ని వినియోగించి పౌర హక్కుల్ని హరించే చర్యలకు స్వస్తి చెప్పాలి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అక్రమ ఆరోపణలతో అరెస్టు చేయబడిన మీడియా ప్రతినిధులను విడుదల చేయాలి. జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ కారణాలతో అరెస్టు చేయబడిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి.
 

                                                                     నేపథ్యం

    దేశమంతటా ఆగష్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్నాం. ఎంతో మంది దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించారు. కార్మికులు, రైతులు పోరాడారు. ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పుసుల్తాన్‌ వంటివారు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగారు. చిట్టగాంగ్‌ ఆయుధాగారంపై దాడి కేసులో గణేష్‌ ఘోష్‌ లాంటి విప్లవకారులను 14 సంవత్సరాల పాటు అండమాన్‌ జైలులో పెట్టి కఠిన శిక్షలు అమలు చేశారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ లాంటి వీరులను ఉరికంబాలెక్కించారు. అల్లూరి సీతారామరాజును కాల్చి చంపారు. బ్రిటీష వాళ్ళ దోపిడీ, జమిందారులు, భూస్వాముల దోపిడీ పోవాలని పోరాటంలో ఎందరో అసువులు బాశారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటించే సందర్భం ఆగష్టు 15. తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం అనగా దేశ ప్రధాని స్వతంత్ర దినోత్సవాన్ని వదిలి ఆగష్టు 14వ తేదీని ''విభజన విషాద స్మృతి దినం'' పాటించాలని ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించారు. అఖండ భారతదేశం అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతికాంశాన్ని ప్రధానమంత్రి ముందుకు తెచ్చారు. 1947 ఆగష్టు 15న అర్థరాత్రి బ్రిటీష్‌ పాలన నుండి భారత్‌ స్వేచ్ఛ పొందింది. లౌకిక రాజ్యంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులోకి వచ్చింది. వివిధ జాతులు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలతో ఎంతో వైవిధ్యం కలిగిన భారత దేశానికి కొత్త రాజ్యాంగం వచ్చింది. మత సహనం విధానంగా మన కాళ్ళ మీద మనం నిలబడే ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోవాలని చర్యలు చేపట్టబడ్డాయి. కానీ ఇప్పుడు లౌకిక ప్రజాస్వామ్యానికి, ఫెడరల్‌ వ్యవస్థకు, సామాజిక న్యాయానికి, ఆర్థిక స్వావలంబనకు బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్‌ మాసంలో ప్రజా సమస్యలపై ఉద్యమాన్ని చేపట్టాలని పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.
 

                                                        రాష్ట్రంలో ప్రజా సమస్యలు

  రాష్ట్రంలో ఐదారు ముఖ్యమైన సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసం అందక రైతాంగం ఆందోళనల్లో ఉన్నారు. విశాఖ ఉక్కును అమ్ముతామన్న కేంద్ర ఉన్మాదపు నిర్ణయంపై ప్రతిఘటన జరుగుతోంది. విద్యారంగంలో సంస్కరణల పేరిట ప్రాథమిక పాఠశాలలను మూడు ముక్కలు చేసి విద్యాభివృద్ధికి గండికొడుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు జరగలేదు. కడప ఉక్కు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు పెండింగులో ఉన్నాయి. వీటికి తోడు విద్యా, వైద్య సంస్థలు, రైల్వే జోన్‌లు ప్రజల మదిలో ప్రధాన సమస్యలుగా మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ యువతలో ఆందోళన రేపింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి రాజధాని వివాదంలో పడింది. మన రాష్ట్రంలో రైతుల పంటలకు ధరలు లేవు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల సవరణకు ఉద్దేశించిన అడ్వయిజరీ కౌన్సిల్‌ 15 సంవత్సరాలు గడుస్తున్నా నియమించలేదు. ఈ సమస్యలను కూడా జోడించి ఈ ఆందోళన సాగించాలి.
 

                                                          బిజెపి కి వంత రాష్ట్రానికి చేటు

      అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం, కొత్తగా ఏర్పడ్డ జనసేన కేంద్ర బిజెపిని బలపర్చడంతో మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతోంది. బిజెపి ప్రజల్లో మత చిచ్చు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నది. మతాన్ని బట్టి సంక్షేమ పథకాలు అందించాలన్న మొండి వాదన ముందుకు తెస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ ఉద్యమం బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ఎక్కుబెట్టాలి. రాష్ట్ర సమస్యలను కూడా జోడించి పోరాడాలి.
 

                                                           సమాఖ్య స్ఫూర్తికి చిచ్చు

      రాష్ట్రాల హక్కులు, పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాలకు వాటాలు, కొత్త రైతు చట్టాలు, విద్యుత్‌ రంగంలో ప్రయివేటీకరణ, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ తదితర అంశాలు ప్రాంతీయ పార్టీల మనుగడకు సవాళ్ళుగా మారాయి. కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. కలిసొచ్చే వారందరినీ ఆహ్వానించి సెప్టెంబర్‌ ఆందోళనలను విజయవంతం చేయాలని సిపిఐ(యం) పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నది.
 

/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
పెనుమల్లి మధు

పెనుమల్లి మధు