Dec 29,2020 07:51

     ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో సోమ, మంగళ వారాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ మాక్‌ డ్రిల్‌పై కేంద్ర ప్రభుత్వ హడావిడి ఆర్భాటం అంతా ఇంతా కాదు. టీకా తయారీ ప్రయోగాలు, క్లినికల్‌ ట్రయల్స్‌ సమయంలో స్వయాన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల లేబొరేటరీలను ఒకే రోజు సందర్శించి అట్టహాసం చేశారు. కరోనా కట్టడిలో, ప్రణాళికాబద్ధ ముందస్తు చర్యల్లో, ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రక్షించడంలో బిజెపి సర్కారు ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. దాన్నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలను రాజకీయంగా ఉపయోగ పెట్టుకుంటోంది. దేశంలో కరోనా ముప్పు తప్పి పోయిందని చెప్పడానికి లేదు. రోజుకు 20 వేలకు పైన కొత్త కేసులు, 300 పైన మరణాలు సంభవిస్తున్నాయి. మొత్తం కేసులు కోటి దాటగా, మరణాలు లక్షన్నరకు చేరాయి. ఇదిలా ఉండగానే వైరస్‌లో కొత్త మ్యుటేషన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బ్రిటన్‌ నుంచి ఇండియాకు వచ్చిన యాభై వేల మంది ప్రయాణికుల్లో కొత్త స్ట్రెయిన్‌ గుర్తింపు నిర్ధారణ పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఆపత్కాలంలో నిత్యం ఎదురవుతున్న కొత్త సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ప్రజల్లో భరోసా కల్పించడంలో కేంద్రం చిత్తశుద్ధి ప్రదర్శించాల్సింది పోయి ఆర్భాటాలకు పెద్ద పీట వేసి విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించడం తగనిపని.
మహమ్మారి అవతారం ఎత్తిన కోవిడ్‌-19 నివారణకు 130 కోట్ల మంది జనాభా కలిగిన పేద దేశమైన మనకు ఎదురయ్యే సమస్యల, ఇబ్బందుల, సవాళ్లపై మోడీ సర్కారుకు కించిత్తు ఆలోచన లేదని దాని వాలకమే తెలియజేస్తోంది. ఇప్పటికి ఐదు వ్యాక్సిన్లు మాత్రమే చివరి దశ ప్రయోగాల్లో సక్సెస్‌ బాటలో నడుస్తున్నాయన్నది వాస్తవం. ఇంకా పలు వ్యాక్సిన్లు వివిధ దశల్లో పయనిస్తున్నాయి. కోవిడ్‌-19 బయట పడ్డాక ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో వ్యాక్సిన్‌లు అభివృద్ధి కావడం విజ్ఞాన సమాజం సాధించిన గొప్ప విజయం. ప్రయోగశాలలో వ్యాక్సిన్‌ ఫార్ములా విజయవంతమైతేనే సరిపోదు. సురక్షితమైన టీకా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి. వ్యాక్సిన్‌ తయారీ, సేకరణ, రవాణా, స్టోరేజి, వ్యాక్సినేషన్‌ పద్ధతి వీటన్నింటికీ పటిష్ట ప్లానింగ్‌ జరగాలి. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అవసరం. వీటన్నింటికీ నిధులు కావాలి. నయా-ఉదారవాద శకంలో సామ్రాజ్యవాద, ధనిక దేశాల ఆధిపత్యం, ఫక్తు వ్యాపార లాభాపేక్ష తిష్ట వేసిన తరుణాన మన లాంటి పేద దేశాల దాకా ఇప్పట్లో వ్యాక్సిన్‌ వస్తుందా అనే ప్రశ్న ఉన్నదే. సరళీకరణ, ప్రైవేటీకరణ జపం చేస్తున్న మోడీ సర్కారు ఇప్పటికే ప్రజారోగ్యాన్ని భ్రస్టు పట్టించింది. అలాంటిది ప్రజలందరి వ్యాక్సినేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్నీ భరిస్తుందా అనేది అనుమానమే. కరోనా సంక్షోభ భారాన్ని రాష్ట్రాల పైకి నెట్టేసి అవి కుదేలవుతుంటే తమాషా చూస్తోంది. వ్యాక్సినేషన్‌కూ అదే దారి చూపిస్తే రాష్ట్రాలు తట్టుకోగలవా? ఇలాంటి ఎన్నో సందేహాలకు కేంద్రానిది మూగనోమే సమాధానం.
        కరోనా విషయంలో కేంద్రం ప్రజలను గాలికొదిలేయగా, రాష్ట్ర ప్రభుత్వం తందానా అంది మినహా కొత్తగా ఆదుకున్నదేమీ లేదు. వైరస్‌ వ్యాప్తిలో దేశంలో రెండవ స్థానంలో ఎ.పి కొనసాగుతున్నప్పటికీ కేంద్రాన్ని నిలదీసి అదనపు నిధులు సాధించింది లేదు. నేటికీ 300 పైన పాజిటివ్‌ కేసులొస్తున్నాయి. కొత్త వైరస్‌ ఆందోళన ఇక్కడా మొదలైంది. అయినప్పటికీ ప్రజలు భయపడాల్సిందేమీ లేదంటున్నారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి. కరోనా మొదట్లో స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేస్తే తప్పుబట్టిన ప్రభుత్వం, రాష్ట్రంలో కేసులు తగ్గాయని చెబుతూ, వైన్‌ షాపులకు, చివరికి సినిమా హాళ్లకు సైతం అనుమతులిచ్చేసి, ఎన్నికలకు మాత్రం కరోనా సెకెండ్‌ వేవ్‌ను సాకుగా చూపడం కేవలం రాజకీయమే. కరోనా విజృంభణను అడ్డుకోవడంలో, పర్యవసానంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజలను బయట పడేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించి ప్రశంసలందుకుంది. అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సార్వజనీన వ్యాక్సినేషన్‌పై ప్రజలకు భరోసా ఇవ్వాలి. అలా కాకుండా మీ వ్యాక్సిన్‌ బాధ్యత మీదేనని చేతులెత్తేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు.