Jan 02,2023 21:41

ఫొటో : పింఛన్‌ అందజేస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

అందరికీ సంక్షే పథకాలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టనష్టాలనైనా భరించి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేజర్ల ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని 15 సచివాలయల పరిధిలో నూతనంగా మంజూరైన 137 సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశ కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా తాను ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం పింఛను నగదును పెంచుకుంటూ ఈ సంవత్సరం లబ్ధిదారులకు రూ.2750 నగదును అందచేస్తున్నారన్నారు.
అర్హతే ప్రమాణికంగా లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్నట్లు వివరించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతటి స్థాయిలో అమలు కావడం లేదని, ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. నూతనంగా మంజూరైన పింఛన్లు అందుకుంటున్న ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని, అర్హత ఉండి పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ పింఛను, సంక్షేమ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పించను నగదును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి బాలిరెడ్డి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, చేజర్ల మండల కన్వీనర్‌ తోమాటి విజయభాస్కర్‌ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి, ఎంపిడిఒ విజయలత, తహశీల్దార్‌ విజయకుమార్‌, నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.