Dec 22,2021 07:00

తీవ్ర రోగాలతో జబ్బున పడిన సమయంలో తరతరాలుగా...చిన్న పిల్లలు, భూమి లేని రైతులు, అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, కాలానుగుణంగా పని చేసే కార్మికులు తమ పరిమిత సంపాదన నుండే వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది. దాంతో అప్పుల ఊబి లోకి, బానిసత్వం లోకి నెట్టబడుతున్నారు. ఉపాధి కల్పనా పథకాలు, వారి దరికి చేరడంలేదు. చేరినా, అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. 'ఆరోగ్య హక్కు'ను కల్పించినట్లయితే అలాంటి ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారికి, సాధారణమైన, పారదర్శకమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలువుతుంది.

    మానవునికి ఉన్న పరిమితమైన జ్ఞాపకశక్తి తరచుగా మన సమిష్టి బాధల నుండి ఉపశమనం పొందడానికి ఉపకరిస్తుంది. కానీ, బాధల నుండి నేర్చుకునే గుణపాఠాలు మరింత కీలకమైనవి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా, ప్రజలు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఎదుర్కొంటున్న విషాదకరమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముందు చూపుతో అవసరమైన గుణపాఠాలను తీసుకోవడం మన నాయకత్వ నైతిక బాధ్యతగా వుండాలి.
    ఈ మహమ్మారి నుండి తీసుకోవాల్సిన ముఖ్యమైన గుణపాఠం ఒకటుంది. అదేమంటే 'అందరికీ ఆరోగ్య హక్కు' అవసరాన్ని గుర్తించడం. కరోనా మహమ్మారి మన ఆరోగ్య రక్షణ వ్యవస్థ లోని లోపాలను బహిర్గతం చేసింది. ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయలేము. అదేవిధంగా గుణపాఠం నేర్చుకోకుండా వుండిపోలేము.
    ఆరోగ్యాన్ని ఒక ప్రాథమిక హక్కుగా ప్రకటించడం కోసం రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయాలని ఈ ఏడాది జూన్‌లో భారత పార్లమెంటును కోరాను. పార్టీ విధానాలకు అతీతంగా, ఈ పిలుపుకు అనుకూలంగా మద్దతు లభించింది. ప్రస్తుతం ఈ అనకూలతను, మన దేశ ప్రజల కోసం, ఆచరణ లోకి తేవడానికి సమయం ఆసన్నమైంది. దీనివల్ల ప్రజలు గతంలో పడిన బాధలు మరెప్పుడూ పడకూడదు.
    భారత పౌరులకు రాజ్యాంగపరమైన ఆరోగ్య హక్కు అంటే ఏమిటి? అనే ప్రాథమికమైన ప్రశ్న ఎదురైంది. మూడు రకాల పౌరులను, దృష్టిలో ఉంచుకొని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. వారిలో రైతులు, అసంఘటిత కార్మికులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు.
   మనం జీవించడానికి గల ప్రాథమిక హక్కులను పరిరక్షించగలిగిన వారు రైతులు మాత్రమే. అయినా అత్యధిక శాతం రైతులు, వారి హక్కులు, సంక్షేమం, కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు ఈనాటికీ వెనుకబడే ఉన్నారు. తీవ్ర రోగాలతో జబ్బున పడిన సమయంలో తరతరాలుగా...చిన్న పిల్లలు, భూమి లేని రైతులు, అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు, కాలానుగుణంగా పని చేసే కార్మికులు తమ పరిమిత సంపాదన నుండే వైద్య ఖర్చులు భరించాల్సి వస్తోంది. దాంతో అప్పుల ఊబి లోకి, బానిసత్వం లోకి నెట్టబడుతున్నారు. ఉపాధి కల్పనా పథకాలు, వారి దరికి చేరడంలేదు. చేరినా, అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. 'ఆరోగ్య హక్కు'ను కల్పించినట్లయితే అలాంటి ఆరోగ్య సంరక్షణ అవసరమైన వారికి, సాధారణమైన, పారదర్శకమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి వీలువుతుంది.
    మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు, అసమానతల వల్ల, స్త్రీలు విపరీతమైన భారాన్ని భరించవలసి వస్తున్నది. వారి ఆరోగ్యం చుట్టూ అలముకొని ఉన్న నిషేధాలు, పరిమితులు, పితృస్వామిక నిబంధనల వల్ల, అధిక మించగల్గిన ఎన్నో ఇబ్బందుల నుండి కూడా బయట పడలేని స్థితిలో ఉన్నారు. దీనితో పాటు వారికి సమాజికంగా, ఆర్థికంగా ఉన్న సవాళ్లు... స్వేచ్ఛగా తమకు లభ్యమయ్యే పరిమితమైన సంరక్షణలు పొందడంలో కూడా అవరోధం అవుతున్నాయి. 'ఆరోగ్య హక్కు' అంటే అర్ధం ఎప్పుడైనా, ఎక్కడైనా స్త్రీలకు అవసరమైనప్పుడు వైద్య సేవలు వారికి అందుబాటులో ఉండటమే.
     మన దేశంలో అత్యంత పేదలైన అట్టడుగు వర్గాలకు చెందిన, అధిక సంఖ్యాకులైన పిల్లలు పొలాల్లో, గనులలో, ఇటుక బట్టీలలో, కర్మాగారాలలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో పని చేస్తూ పెరుగుతున్నారు. వారు ఒత్తిడితో కూడిన కుటుంబ ఆర్థిక అవసరాల రీత్యా, పాఠశాలల్లో నమోదు చేసుకోవడంగానీ, హాజరు కావడంగానీ జరగడంలేదు. తరచుగా వైద్య ఖర్చుల కోసం జేబులో నుండి డబ్బులు ఖర్చు చేయవలసి రావడం వల్ల కూడా ఈ పరిస్థితి నెలకొంటున్నది.
    మేము నిర్వహించే సంస్థ ద్వారా, అలాంటి బాల కార్మిక వ్యవస్థ నుండి, వెట్టి చాకిరీ నుండి, అక్రమ రవాణా నుండి లక్ష మంది పిల్లలను రక్షించాం. ఆ సమయంలో, ఈ పిల్లలు క్లిష్టమైన పనుల ప్రభావం వల్ల ప్రాథమికంగా, క్షయ, చర్మ వ్యాధులు, దృష్టి లోపం, పౌష్టికాహార లోపంతో పాటు, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ఈ పిల్లలకు బాల్యపు ప్రారంభ దశలో, అవసరమైన సంరక్షణలు నిరాకరించబడ్డాయి. దీనివలన ఈ సమస్యలను వారు జీవిత కాలం ఎదుర్కొనాల్సి వస్తున్నది. అదే ఆరోగ్య హక్కును కల్పించినట్లయితే...పిల్లలు దోపిడీకి గురయ్యే స్థాయి నుండి రక్షణతో కూడిన భవిష్యత్‌ వైపు మార్పు చెందడానికి వీలవుతుంది.
    రాజ్యాంగ పరమైన 'ఆరోగ్య హక్కు' మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం తోపాటు, ప్రజల సంక్షేమానికి, సత్వర ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న ఏరకమైన పెట్టుబడులైనా, భారత ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడంలో గానీ, వారు రక్షణ కవచంగా భావించడంలో గానీ విఫలమయ్యాయి. దీనితో పాటు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న ఆరోగ్య సంరక్షణలను, అనైతిక పద్ధతులలో వినియోగించడం వల్ల, ప్రజలకు ఉపశమనం కలగకపోగా, మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యానికి రాజ్యాంగ పరమైన హక్కులు కల్పించినట్లయితే, ఆయుష్మాన్‌ భారత్‌ యొక్క లక్ష్యం బలపడుతుంది. రాజ్యాంగ పరమైన ఆరోగ్య హక్కు కారణంగా ఆర్థిక పరమైన రక్షణ లభిస్తుంది. కేటాయింపులు పెంచడం వల్ల ఒక వైపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ పొదుపు సాధ్యపడుతుంది. సుదూర భవిష్యత్తులో ఉద్వేగపూరితమైన, మానసికపరమైన, సామాజిక పరమైన రక్షణ విషయంలో ప్రజలపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని గమనించగలము.
    ప్రపంచం లోని, చిన్న, పెద్ద దేశాలు కూడా, మహమ్మారి నుండి కోలుకోవడానికి, విధాన నిర్ణయాలలో, పెట్టుబడుల విషయంలో, ముందు చూపుతో అనేక చర్యలు చేపడుతున్నాయి. భారత్‌ ఈ విషయంలో వెనుకబడరాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నిర్భంధ విద్య నిస్సందేహంగా ఘనవైన వారసత్వాలలో ఒకటి. ప్రజా ప్రయోజనాల కోసం, వారికి మరింత మేలు జరగడం కోసం సమయానుకూలంగా నాయకుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో 'ఆరోగ్య హక్కు'ను ప్రవేశ పెట్టడం ఈ ప్రభుత్వానికి వారసత్వపు ఆస్థిగా ఉంటుంది.

('ద హిందూ' సౌజన్యంతో)

వ్యాసకర్త : నోబెల్‌ గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త
కైలాష్‌ సత్యార్థి

కైలాష్‌ సత్యార్థి