Jan 02,2023 09:43

పింఛన్‌ పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌

         హిందూపురం : అవ్వా, తాతలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఆదివారం పురపాలక సంఘం పరదిలోని 23వ వార్డులో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజతో కలిసి పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో 20 రోజుల వరకు పింఛన్ల పంపిణీ జరిగేదని, ఇప్పుడు ఒక రోజులోనే 95 శాతం పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో జన్మభూమి కమిటీ చెప్పిన వారికే పింఛను వచ్చేదని ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించే పద్ధతే ఉండేది కాదన్నారు. లంచాలు ఇచ్చే వారికే పింఛన్లు ఇచ్చేవారన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలతో పాటు, దివ్యాంగులు ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారుతీరెడ్డి, అయూబ్‌, నాయకులు బసిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.