అదొక దట్టమైన అడవి. ఆ అడవికి మైరావణుడనే సింహం రాజుగా ఉంది. ఆ మృగరాజుకు ప్రతిరోజూ ఏదో ఒక జంతువును చంపి ఆహారంగా స్వీకరించడం అలవాటు. ఏరోజు ఏ జంతువును తింటుందోర తెలియక జంతువులన్నీ బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నాయి. పిల్ల జంతువులను చంపితే వాటిని కన్న జంతువులు కన్నీరు పెట్టుకుంటున్నాయి. పెద్ద వాటిని చంపితే అయ్యో..! తల్లిదండ్రుల్ని కోల్పోయామే అని చిన్న జంతువులు రోదిస్తున్నాయి. సింహం ఏరోజు ఎవరిని తింటుందో తెలియక భయాందోళనలో ఉన్నాయి జంతువులు. తమకు ఏదో ఒక పరిష్కారమార్గాన్ని చూపమని గజేంద్రుడి దగ్గరకు వెళ్లాయి. గజేంద్రుడిని రాయబారిగా పంపాయి. గజేంద్రుడు తన వద్దకు రావడం చూసిన మృగరాజు 'ఏం.. ఎందుకొచ్చావు?' అని గర్జించి అడిగింది. అప్పుడు గజేంద్రుడు జంతువుల సమస్యను వివరంగా చెప్పింది. 'తమరు ఏరోజు ఏ జంతువును చంపుతారో తెలియక ఆందోళన చెందుతున్నాయి. దానికి పరిష్కారం చూపమని నన్ను పంపించాయి' అని చెప్పింది గజేంద్రుడు. దానికి ఆ మృగరాజు క్షణం ఆలోచించి 'ప్రతిరోజూ నాకొక జంతువు ఆహారంగా కావలసిందే.. అలా రోజూ నా వద్దకు ఎవరు వస్తారో మీరే ఆలోచించుకుని వస్తే సరిపోతుంది!' అని గజేంద్రునికి చెప్పి పంపేసింది సింహం.
గజేంద్రుడు వెళ్లి జంతువులన్నింటికీ మృగరాజు చెప్పిన విషయాన్ని తెలియజేసింది. అప్పుడు జంతువులన్నీ ఆలోచనలోపడ్డాయి. పిల్ల జంతువులన్నీ కలిసి వారి తల్లిదండ్రులతో 'రాజుకి ఆహారంగా మేమే వెళ్తాం. మీరు పెద్ద దిక్కుగా మిగిలినవారికి అండగా ఉండండి. మీ అవసరం ముందుతరాలకు ఎంతో ఉంది' అన్నాయి. దానికి ముసలి జంతువులు నిరాకరించాయి. 'మా కన్నబిడ్డలు మీరు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాం మిమ్మల్ని. అటువంటిది మీరు మా కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతే మేం భరించగలమా? మీకెంతో భవిష్యత్తు ఉంది. శక్తి యుక్తులున్నాయి.. ఆలోచించగలిగే నేర్పు ఉంది. సాహసం చెయ్యగల ధైర్యం ఉంది. పరిస్థితులను మీకనుకూలంగా మార్చుకోగల సామర్థ్యం మీకుంది.. మాకా వయసైపోయింది. మేమింకా ఉండి ఏం ప్రయోజనం? అందుకని మీరు వెళ్లడానికి వీల్లేదు.. మేమే వెళ్తాం' అన్నాయి.
దీంతో మళ్లీ నిర్ణయానికి మృగరాజు దగ్గరకే వెళదాం. సింహం మనందరికీ రాజు కనుక తనే మార్గం చూపిస్తుందేమో చూద్దాం!' అనుకుని అన్ని జంతువులూ కలిసి, మళ్లీ సింహం వద్దకే వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నాయి. మృగరాజు ఇరువైపులా వాదనలు విని, తన మనసు ఒక్కసారిగా చలించింది. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను, అభిమానాన్ని గుర్తించింది. పిల్లలంటే పెద్ద జంతువులకు ఎంత మమకారమో? పెద్దలంటే పిల్లలకు ఎంత భక్తి, గౌరవమో? తెలుసుకుంది. వాటి వ్యక్తిత్వం ముందు తాను ఎంత చిన్నదో గ్రహించి, సిగ్గుపడింది.
'నిజంగా మీ త్యాగానికి నేను ఆశ్చర్యపోతున్నాను. ఒకరంటే మరొకరికి ఎంత అభిమానమో చూసి విస్మయం చెందుతున్నాను. నిజమే.. పిల్లలంటే పెద్దవాళ్లకు ఎంత ముద్దో.. వారిని చంపుకోడానికి ఇష్టపడరు. అలాగే పెద్దలను కోల్పోవడానికి పిల్లలకు మనస్కరించదు. నిజంగా మీ ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు నేను చాలా చిన్నదాన్ని. మీరెంతో పెద్ద మనసుతో ప్రవర్తించారు. ఇక నుంచి నేను ఎవరినీ చంపను. హింస జోలికే వెళ్లను. మీలాగే సాత్వికమైన ఆహారమే తింటాను. మీ యొక్క త్యాగబుద్ధి మనుషులకూ ఆదర్శంగా నిలుస్తుంది. మీరంతా నిర్భయంగా వెళ్లి, మీకిష్టమైన రీతిలో జీవించండి' అని జంతువుల్ని పంపేసింది మృగరాజు. జంతువులన్నీ సంబరంతో వెనుదిరిగాయి.
జి.రంగబాబు
94401 90669