Mar 11,2022 08:51
  • 919.55 శాతానికి ఆదాయ లోటు
  •  సొంత ఆదాయం రూ.1,11,792 కోట్లు
  • చేసిన వ్యయం రూ.1,69,842 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా కేవలం కొద్ది రోజులే ఉంది. ఈ సమయంలో తొలి పది నెలలకు సంబంధించిన ఆర్థిక గణాంకాలు ఆర్థికశాఖకు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. బడ్జెట్‌లో ఆమోదించిన అంకెలు పూర్తిగా తారుమారవుతున్నాయి. ఆదాయం దగ్గర నుంచి, వ్యయం, రుణం, వడ్డీలు వంటివి పూర్తిగా మారిపోయాయి. ప్రధానంగా లోటు అన్నది పెద్ద సమస్యగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
    ఆదాయం తగ్గిపోయి, వ్యయం పెరగడంతో ఆదాయ లోటు భారీగా నమోదైంది. ఏకంగా 919.55 శాతంగా లోటు రికార్డవడం గమనార్హం. బడ్జెట్‌లో కేవలం రూ.ఐదువేల కోట్లు మాత్రమే లోటుగా ఉంటుందని పేర్కొనగా, అది జనవరి నాటికే రూ.45,978 కోట్లకు చేరిపోయింది. ఇదే లోటు గతేడాది 293 శాతంగా మాత్రమే ఉండడం గమనార్హం. ఇక ద్రవ్యలోటు కూడా భారీగానే నమోదైంది. బడ్జెట్‌లో రూ.37,029 కోట్లుగా చూపించగా, జనవరి నాటికి 158.44 శాతంతో రూ.58,670 కోట్లకు చేరిపోయింది.
     మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే బడ్జెట్‌లో 2.14 లక్షల కోట్లుగా చూపించగా, అది కేవలం 79.57 శాతంతో 1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. అయితే గతేడాది కన్నా మాత్రం రెండు శాతం అధికంగా ఉండడం కొరత ఊరటనిస్తోంది. వ్యయం కూడా రూ.2.13 లక్షల కోట్లుగా బడ్జెట్‌లో ఆమోదించగా, ఇప్పటివరకు కేవలం 1.69 లక్షల కోట్లే ఖర్చు చేయగలిగారు. ఇది మొత్తం అంచనాలో కేవలం 79.59 శాతంగానే ఉండడం గమనార్హం. ఇందులో పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే ఉన్నట్లు తేలింది. బడ్జెట్‌లో రూ.31,198 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 38.70 శాతంతో రూ.12,072 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఈ ఏడాదికి మొత్తం రూ.37,029 కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించగా, పది నెలల్లోనే రూ.58,670 కోట్లు రుణం చేయడం విశేషం. ఇది అరచనా కన్నా 158 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే వడ్డీ చెల్లింపులు మాత్రం బడ్జెట్‌ అంచనా కన్నా తక్కువగా ఉండడం విశేషం. బడ్జెట్‌లో రూ.22,740 కోట్లు అవుతుందని ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ.17,567 కోట్లు వడ్డీలకు చెల్లించారు. అయితే ఫిబ్రవరి, మార్చిలో వడ్డీ చెల్లింపులు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

11