ప్రజాశక్తి -పరిగి : మండలంలోని కొడిగెనహళ్లి ఎపిఆర్‌ఎస్ ఎక్సలెన్స్ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసాయి. పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ స్టేట్ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు హాజరయ్యారు. ఆయనతోపాటు ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు ఐఆర్‌ఎస్ ఆంజనేయులు, విజరు కుమార్, ఇండియన్ టెలికాం సర్వీస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సురేంద్రబాబు, ఎన్‌ఆర్‌ఐలు సురేంద్ర పెరుగు, శ్రీరామ్ వెంకటకృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ 1972లో పివి నరసింహారావు చొరవతో స్థాపించబడిన నేటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ విద్యాలయం ఎంతోమంది వ్యక్తులను దేశానికి అందించిందని అన్నారు. విజ్ఞానంతో పాటు సంస్కారం, దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవా తత్పరత ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుల ద్వారా తాము నేర్చుకుని ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. అనంతరం పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తాము కృషి చేస్తున్నామని భవిష్యత్తులో కూడా తమ తోడ్పాటు కొనసాగుతుందని అన్నారు. ఇలాగే అనేకమంది మేధావులను అందించే విద్యాసంస్థగా కొనసాగడానికి ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయాలని కోరారు. కోడిగిన హళ్లి రాష్ట్రస్థాయిలో ఏ గురుకుల పాఠశాలకు లేనన్ని వసతులను పూర్వ విద్యార్థుల సంఘం సమకూర్చిందని ఇక్కడ చదివిన విద్యార్థులుగా తమ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నారని, వీరి సేవలు, మరువలేనివని కొనియాడారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు గతంలో పాఠశాలలో తమకు బోధించిన గురువులను, ప్రస్తుతం పని చేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోడిగెనహళ్లి గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు సురేష్ పెరుగు, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.










