- ఒపిఒ ముసాయిదాను సెబీకి సమర్పించిన కేంద్రం
న్యూఢిల్లీ : కోట్లాది మంది భారతీయుల సంక్షేమానికి తోడ్పడుతున్న కామధేనువు లాంటి ఎల్‌ఐసిని ప్రైవేటీకరించే క్రమంలో తొలి చర్యగా ఎల్‌ఐసి ఐపిఓ ముసాయిదా పత్రాలను సెబికి సమర్పించింది. 5 శాతం ఈక్విటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 31.6 కోట్ల షేర్లను పబ్లిక్ ఆఫర్ ద్వారా విక్రయించేందుకు గాను ఎల్‌ఐసి ఐపిఒ యొక్క డిఆర్‌హెచ్‌పి ముసాయిదాను కేపిటల్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబికి ఆదివారం అప్పగించినట్లు డిపార్టుమెంట్ ఆప్ ఇన్వెస్టిమెంట్స్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్‌మెంట్ (దీపం) సెక్రటరీ తుహిత్ కాంత పాండే ట్వీట్ చేశారు. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ముసాయిదా ప్రకారం, అంతర్జాతీయ యాక్చురియల్ సంస్థ మిల్లిమాన్ అడ్వైజర్స్ సెప్టెంబర్ 30, 2021 నాటికి ఎల్‌ఐసి యొక్క ఎంబెడెడ్ విలువ సుమారు రూ. 5.4 లక్షల కోట్లుగా నిర్ణయించింది. మార్చి 31, 2021 నాటికి 283 మిలియన్ పాలసీలు, 1.35 మిలియన్ ఏజెంట్లతో కొత్త బిజినెస్ ప్రీమియంలతో ఎల్‌ఐసి 66 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందనిపాండే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 78,000 కోట్లను చేరుకోవడానికి మోడీ ప్రభుత్వం ఎల్‌ఐసిని కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను స్ట్రాటజిక్ సేల్ పేరుతో కారుచౌకగా టాటాకు కట్టబెట్టింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఐపిఓను నిర్వహించడానికి ప్రభుత్వం కోటక్ మహీంద్రా క్యాపిటల్, గోల్డ్‌మన్ సాచ్స్ (ఇండియా) సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా 10 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించింది. ఎల్‌ఐసీలోవాటాలను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది.










