Feb 27,2022 07:39

'అమ్మా..నాన్నా మేం క్షేమంగానే ఉన్నాం. కాని తినడానికి తిండి లేదు. తాగే నీరు లేదు. బయటికి వెళ్లే దారి లేదు. రవాణా స్తంభించిపోయింది. చేతిలో డబ్బులు లేవు. బ్యాంకు సర్వీసులన్నీ ఆపేశారు. నిత్యావసరాల దుకాణాలు మూతబడ్డాయి. ఇలా ఎన్నిరోజులు ఉంటుందో భయమేస్తోంది. మాతోపాటు కొన్నివేల మంది ఇక్కడ చిక్కుకుపోయాం. మమ్మల్ని ఎలాగైనా ఇండియా రప్పించండి' అంటూ ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్న భారతీయ విద్యార్థుల రోదనలు వార్తామాధ్యమాల్లో ప్రసారమవుతున్నాయి. తమ బిడ్డలకు ఏమవుతుందో తెలియని అయోమయంలో ఉన్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కన్నబిడ్డలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయే తల్లిదండ్రులు వారు ఇప్పుడు భీకరయుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడం చూసి తట్టుకోలేకపోతున్నారు. పిల్లలను ఎలాగైనా తమదగ్గరకు తీసుకురమ్మని పాలకులకు మొరపెట్టుకుంటున్నారు.
సుమారు 18 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యి నుంచి 1500 మంది ఉంటారని అంచనా. ఉక్రెయిన్‌లో దాదాపు 50 వైద్య కళాశాలలున్నాయి. 19 వర్సిటీలకు భారత వైద్యమండలి గుర్తింపు ఉంది. మనదేశంలో కంటే అక్కడ వైద్యవిద్యకు అయ్యే ఖర్చు తక్కువగా ఉండడంతో కీవ్‌, లుగాన్‌స్కీ, బ్లాక్‌సి, డోనెస్క్‌, ఖర్కీవ్‌, జాపోరిజియా, డాన్లో, హలేస్కీలీవ్‌, బుకోవినియన్‌ తదితర వర్సిటీల్లో చదువుకునేందుకు తెలుగు విద్యార్థులు అక్కడికి తరలివెళుతున్నారు.

  • చాలా భయంగా ఉంది

'మాకు ఎటువంటి సహాయం అందడం లేదు. మా హాస్టల్‌ పక్కనే బాంబు దాడులు జరుగుతున్నాయి. మేము ఉంటున్న ప్రాంతం నుంచి సరిహద్దుకు చేరుకోవడానికి 15 గంటల సమయం పడుతుంది. ఎంబసీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. మా సొంతంగా అక్కడి వరకు వెళితే మమ్మల్ని ఇండియాకు తీసుకెళతామని చెబుతున్నారు. కాని ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యాలు లేవు. చాలా భయంగా ఉంది. బంకర్లలో తలదాచుకుంటున్నాం' అంటూ వాపోయింది విజయవాడకు చెందిన విహారి. విహారి మెడిసిన్‌ చివరి సంవత్సరం చదువుతోంది.

  • దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి

'యుద్ధంలో మేమంతా ఇరుక్కుపోయాం. ఇండియాకు ఎలా రావాలో అర్థం కావడం లేదు. ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించినప్పుడు చాలా భయమేస్తోంది. మా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇండియా ఎంబసీ చర్యలు తీసుకొని ఆర్మీ ఫ్లైట్స్‌ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. నాతో పాటు చాలామంది ఉన్నారు. దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి' అంటూ వేడుకుంటోంది విశాఖపట్నం, పెందుర్తి మండలం, రాంపురం గ్రామం నుంచి వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లిన శ్రీజ. శ్రీజ మెడిసిన్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.

  • ఏంచేయాలో అర్థంకావడం లేదు

'పదిపదిహేను రోజులుగా భయంభయంగా గడుపుతున్నాం. ఏ నిమిషం ఏం జరుగుతోందో తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఐదున్నరేళ్లుగా ఇక్కడ వైద్యవిద్య చదువుతున్నాం. మరో మూడునెలల్లో కోర్సు పూర్తయి ఇండియాకు వచ్చేస్తామనుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది' అంటోంది కీవ్‌ యూనివర్శిటీలో చదువుతున్న శెట్టిపల్లి సంహిత.

  • పరిస్థితి ఘోరంగా ఉంది

'ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. హాస్టల్‌ నుంచి బయటికి వెళ్లొద్దని చెప్పారు. తినడానికి ఆహారం లేదు. నేను రాజధాని కీవ్‌లో ఉన్నాను. హాస్టల్‌లో ఉన్న బంకరులో తలదాచుకున్నాం. 5 కిలోమీటర్ల దూరంలోనే బాంబు దాడి జరిగింది' అంటూ అనంతపురం జిల్లా నాయక్‌నగర్‌లో ఆర్టీసీ డ్రైవరు కుమారుడు దినేష్‌ ఫోనులో చెబుతున్నప్పుడు ఆ తండ్రి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. 'డాక్టరు కావాలని దినేష్‌ కలలుగనేవాడు. నేను ఎంతో కష్టపడి నా బిడ్డను అక్కడికి పంపించాను' అంటున్నారు ఆయన. 'యుద్ధం వార్తలు విన్న తరువాత విమాన ఖర్చుల కోసం నాన్న రూ.60 వేలు పంపించారు. ఇప్పుడేమో లక్షన్నర ఖర్చు అవుతుందని చెబుతున్నారు. అంత ఖర్చు నాన్న పెట్టుకోలేరు. నేను ఇక్కడే ఉండిపోతాను. రాత్రి 15 మందే ఇక్కడ తలదాచుకున్నాం. ఇప్పుడు 2 వేల మంది వచ్చారు. ఆడపిల్లలను లోపలే ఉంచి మేము బయట ఉంటున్నాం' అంటూ దినేష్‌ తల్లితో మాట్లాడుతున్నప్పుడు భయంతో అతని గొంతు వణుకుతోంది.
అక్కడి వీడియోలు చూస్తుంటే పిల్లలైతే క్షేమంగా లేరని అర్థమవుతోంది అంటున్నారు ఆ తల్లిదండ్రులు. ఒక్క తూర్పు గోదావరి నుంచే 50 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

  • ఆందోళనగానే ఉంది

'మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌. జాపోరిజియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఆరో సంవత్సరం చదువుతున్నాను. అప్పటివరకు బాగానే ఉన్న మేము ఒక్కసారిగా ఇక్కడి పరిస్థితిలో మార్పు రావడంతో ధైర్యాన్ని కోల్పోయాం. కొందరు మా జూనియర్లు ముందే తెలుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం మేము సురక్షిత ప్రాంతంలోనే ఉన్నప్పటికీ యుద్ధ వాతావరణం ఆందోళన కలిగిస్తోంది' అంటోంది నిహారిక.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను తీసుకొచ్చేందుకు 1902, ఎపిఎన్‌ఆర్‌టి హెల్ప్‌లైన్లను సంప్రదించవచ్చని తెలియజేసింది. ఇప్పటికే వచ్చిన సందేశాలనుసరించి ఒక వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి సూచనలు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం 22 మందిని ఇండియాకు చేరవేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే విద్యార్థులే కాక భారత్‌ నుంచి ఉద్యోగార్థం ఉక్రెయిన్‌ వెళ్లిన వారి వివరాలు ఇంతవరకు తెలియలేదు. యుద్ధం, అల్లర్లు వంటివి సంభవించినప్పుడు సామాన్యుల జీవితాలు అల్లకల్లోలమవుతాయనడానికి ఉక్రెయిన్‌ వైద్యవిద్యార్థుల ఉదంతాలు ప్రత్యక్ష నిదర్శనాలు.