Jan 05,2023 20:15

బాలుడిని తల్లి పోలమ్మకు అప్పగిస్తున్న సిఐ వేమారెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :అలిగి ఇంటి నుంచి పారిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్ణపట్నం సిఐ కె. వేమారెడ్డి తెలిపిన వివరాల మేరకు విడవ లూరు గ్రామానికి చెందిన చవుటూరు విష్ణు మహేంద్ర అనే ఏడేళ్ల బాలుడు తన తల్లి తిట్టిందని అలిగి ఇంటి నుంచి పారిపోయి మండలంలోని వరకవిపూడి చేరుకొన్నాడు. వీధుల్లో తచ్చాడుతున్న బాలుడి వాలకాన్ని గమనించిన మహిళా పోలీస్‌ సుమలత రాజ్‌ గుర్తు తెలియని ఆ బాలుడి సమాచారాన్ని సిఐ వేమారెడ్డికి చేరావేశారు. వెంటనే స్పందించిన సిఐ వేమారెడ్డి బాలుడి ఫోటో, వివరాలను నెల్లూరు రూరల్‌ సబ్‌ డివిజన్‌, సబ్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని మహిళా పోలీసు గ్రూపులో పోస్ట్‌ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న విడవలూరు ఎస్‌ఐ వాసు చేపట్టిన విచారణలో ఇంటి నుంచి పారిపోయిన బాలుడు విష్ణు మహేంద్ర విడవలూరు గ్రామానికి చెందిన చవుటూరు పోలమ్మ కుమారుడు అని నిర్ధారించారు. మహిళా పోలీసు సుమలత రాజ్‌ వద్ద భద్రంగా వున్న బాలుడిని సీఐ వేమారెడ్డి తోటపల్లిగూడూరు పోలీస్‌ స్టేషన్‌ కు రప్పించి సమాచారాన్ని తల్లి పోలమ్మకు అందజేశారు. తప్పిపోయిన తన కుమారుడు విష్ణు మహేంద్ర సమాచారం అందుకున్న తల్లి పోలమ్మ సిఐ వేమారెడ్డి సంరక్షణలో ఉన్న కుమారుడిని గుండెలకు హత్తుకొని ఆనందభాష్పాలు రాల్చింది. తమ కుమారుడిన తన వద్దకు చేర్చిన సీఐ వేమారెడ్డికి, మహిళా పోలీసు సుమలత రాజ్‌ కు తల్లి పోలమ్మ కత్ఞలు తెలిపింది. కుమారుడిని తీసుకొని సంతోషంతో ఇంటి ముఖం పట్టింది. కాగా తప్పిపోయిన బాలుని విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిన మహిళా పోలీస్‌ సుమలత రాజ్‌ ను సీఐ వేమారెడ్డి ప్రత్యేకంగా అభినందించి రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.